సమస్యల సుడిలో పోలీస్ స్టేషన్
హుబ్లీ: సమస్యల సుడిలో స్థానిక పోలీస్ స్టేషన్ కట్టడం కొట్టుమిట్టాడుతోంది. తరలింపునకు స్థలం, కాలం కలసి వచ్చినా తరలింపు భాగ్యానికి మాత్రం ఇంకా నోచుకోలేదు. 15 ఏళ్ల క్రితం నిర్మించిన కట్టడం ఇది. రాజ కాలువపై నిర్మించారు. ఈ రాజకాలువ పక్కన జాతీయ రహదారి కూడా ఉంది. కాలువ కింది భాగం అక్కడక్కడ శిథిలం అయింది. స్టేషన్ ఎదుట సరుకులతో నిండిన లారీ లేక ఏ భారీ వాహనమో పోతున్నా చాలు కాలువ అడ్డుగోడ కంపిస్తోంది. అలాగే స్టేషన్ కట్టడం కూడా వణుకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడేం జరుగుతుందన్న ఆందోళనతో పోలీస్ సిబ్బంది, భయభ్రాంతులతోనే నిత్యం సేవలు నిర్వహిస్తున్నారు. ఈ స్టేషన్‌లో పని చేయడం యోగ్యం కాదని ప్రజాపనుల శాఖ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించింది. ఈ నివేదిక నేపథ్యంలో 2024 మే 15న జిల్లాధికారి, పాలికె కమిషనర్, ఇంజినీర్లు స్టేషన్ కట్టడాన్ని పరిశీలించారు. తరలించాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ తరలింపు చర్యలు చేపట్టాలని పాలికె డివిజన్ 7 అసిస్టెంట్ కమిషనర్ గత మే 23న పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. ఇది జరిగి 8 నెలలు గడుస్తున్నా ఇంకా తరలింపు చర్య చేపట్టలేదు.
తగిన స్థలం గుర్తించాలని చెప్పాం
ఈ విషయమై హుబ్లీ ధార్వాడ పాలికె కమిషనర్ డాక్టర్ ఈశ్వర్ ఉల్లాగడ్డి స్పందించారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్‌కు సమాచారం ఇచ్చామన్నారు. ఈ మేరకు పాలికె సాధారణ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. తగిన స్థలాన్ని గుర్తించి తరలించాలని చెప్పాం. స్టేషన్ తరలింపు జరిగాక పాత స్టేషన్‌ను తొలగిస్తామన్నారు. పోలీస్ కమిషనర్ శశికుమార్ మాట్లాడుతూ స్టేషన్‌ను రాజకాలువపై నిర్మించారు. ఈ ఏడాది భారీ వర్షాల వల్ల కట్టడానికి చిన్నచితకా హాని వాటిల్లింది. దీంతో స్టేషన్ తరలింపు మంచిదని పాలికె అధికారులు సూచించారన్నారు. ఇప్పటికే పాలికె ఓ సముదాయ భవనాన్ని గుర్తించింది. అయితే పోలీస్ శాఖ దగ్గర స్థలం లేదు. కార్పొరేషన్ పరిధిలో నాలుగైదు వేల అడుగుల స్థలం, సిబ్బందికి గదులు, అంతేగాక వచ్చి పోయే ప్రజలకు, అలాగే సీజ్ చేసిన వాహనాలను నిలపడానికి స్థలం అవసరం ఉంది. దీంతో తగిన స్థలం గుర్తించాలని పాలికెకు విజ్ఞప్తి చేశామని, ఆ మేరకు ఓ స్థలాన్ని గుర్తించామని సీనియర్ అధికారుల అనుమతితో స్టేషన్‌ను తరలిస్తామని ఆయన అన్నారు.
కంపిస్తున్న కమరిపేట భవనం
తరలింపునకు కలసిరాని కాలం
Comments
Please login to add a commentAdd a comment