అలసత్వ అధికారులతో వేగేదెలా?
రాయచూరు రూరల్: జిల్లాలో అభివృద్ధి పనులకు అధికారులు కంకణ బద్ధులు కావాల్సింది పోయి పని చేయని అధికారులతో ప్రభుత్వాన్ని ఎలా నడపాలని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి సంతోష్ లాడ్ ధ్వజమెత్తారు. సోమవారం జెడ్పీ సభాంగణంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక శాఖ అధికారుల వేధింపులు, వేతనాలు, లైసెన్సులు పొందిన కాంట్రాక్టర్ల వద్ద ఎంత మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారో విదితం కావడం లేదని మంత్రి అధికారులపై మండి పడ్డారు. వివరాలు లేకుండా సమావేశాలకు హాజరు కావడానికి మీకు సిగ్గుగా లేదా? అని నిలదీశారు. అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయాల్లో కాలయాపన చేసి వేతనాలు పొందడం కాదు, కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించక పోవడాన్ని తప్పుబట్టారు. చిన్న వ్యాపారస్తుల నుంచి ముక్కు పిండి జరిమానా కట్టించుకోవడమే తప్ప పెద్ద కంపెనీలు, పరిశ్రమలపై దాడులు చేశా,రా? అని మంత్రి అధికారులను ప్రశ్నించారు.
అధికారుల మధ్య సమన్వయలోపం
బాల కార్మిక పద్ధతి నిర్మూలనలో అధికారుల మధ్య సమన్వయం లోపించిందన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాడులు జరిపి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, బాల్య వివాహాల నియంత్రణలో సామరస్యతను పాటించాలని ఆదేశించారు. యాదగిరి జిల్లాలో బాల కార్మిక పద్ధతి అధికంగా ఉందని, అక్కడి అధికారులు నిద్రపోతున్నారన్నారు. రాయచూరులో ఆర్టీపీఎస్, వైటీపీఎస్ కంపెనీల్లో కార్మికులను వంచనకు గురి చేస్తున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. 464 పరిశ్రమలున్నా వాటిలో బిహార్ కార్మికులున్నారని, కన్నడిగులకు ఉద్యోగాలు లేకుండా ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను తుంగలోతొక్కి ఇష్టమొచ్చినట్లు అధికారులు వ్యవహరించడం తగదన్నారు. కార్మికులకు స్మార్ట్ కార్డుల పంపిణీలో నిర్లక్ష్యం వహించడంపై మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్యేలు హంపయ్య నాయక్, బసన గౌడ దద్దల్, కరెమ్మ నాయక్, కార్మిక శాఖ కమిషనర్ గోపాల్, కార్యదర్శి భారతి, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే, ఎస్పీ పుట్టమాదయ్యలున్నారు.
అబద్ధాలే మోదీ 11 ఏళ్ల పాలన సాధన
కేంద్రంలోని బీజేపీ సర్కార్ 11 ఏళ్ల పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబద్ధాలు చెప్పడమే సాధన అని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి సంతోష్ లాడ్ పేర్కొన్నారు. సోమవారం జెడ్పీ సభాంగణంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సమయంలో డాలర్ విలువపై మాట్లాడిన మోదీ నేడు రూ.86కు తగ్గిందని, ఈవిషయంపై మౌనం వహించడం సరికాదన్నారు. అందరినీ అవమాన పరిచే విధంగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించడాన్ని తప్పు బట్టారు. కనీస వేతనాల కింద 224 మందికి రూ.10 కోట్ల పరిహారం అందించామన్నారు. పరిశ్రమల విషయంలో రూ.34 కోట్ల పరిహారం అందించడానికి చర్యలు చేపట్టామన్నారు.
అభివృద్ధి పనులకు అధికారులు
కట్టుబడాలి
కార్మిక శాఖా మంత్రి సంతోష్ లాడ్ ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment