తృణధాన్యాల్ని రోజూ ఆహారంలో భుజించాలి
బళ్లారిఅర్బన్: కల్తీ లేని ఆరోగ్యవంతమైన తృణధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను అందరూ ప్రతి రోజు తమ ఆహార పద్ధతుల్లో అలవరుచుకోవాలని, తద్వారా ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా సూచించారు. అంతర్జాతీయ తృణధాన్యాలు, సేంద్రియ మేళా సందర్భంగా జిల్లా స్థాయిలో అవగాహన కల్పించడానికి జిల్లా యంత్రాంగం, జెడ్పీ, వ్యవసాయ శాఖ సహకారంతో పాత జిల్లాధికారి కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సిరిధాన్య నడిగె కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. తృణధాన్యాల సేవనం ఆరోగ్యానికి చాలా మంచిదన్నారు. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు లేకుండా పండించిన తృణధాన్యాలను ఎక్కువగా ఇళ్లల్లో ఉపయోగించాలన్నారు. జంక్ ఫుడ్ వాడకం వల్ల చిన్నపిల్లల్లో భయంకరమైన వ్యాధులు వ్యాపిస్తున్నాయని ఆయన హెచ్చరించారు. ఇటీవల తృణధాన్యాల వాడకం వల్ల కలిగే లాభాల గురించి ప్రజల్లో చైతన్యం, వాటి వాడకం కూడా పెరిగిందన్నారు.
23 నుంచి సిరిధాన్య మేళా
వ్యవసాయ శాఖ జేడీ సోమసుందర్ మాట్లాడుతూ తృణ ధాన్యాలతో వివిధ వంటలను తయారు చేయడం గురించి జాగృత పరచడానికి వివిధ పోటీలు, జాతాను ఈ నెల 23 నుంచి 25 వరకు బెంగళూరు ప్యాలెస్ మైదానంలో అంతర్జాయ వాణిజ్య మేళా, సేంద్రియ, సిరిధాన్య మేళాలను ఏర్పాటు చేశామని, వీటిని అందరూ సద్వినియోగ పరుచుకోవాలన్నారు. తృణధాన్యాల్లో పీచు, ఐరన్ అంశాలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అంతకు ముందు సిరిధాన్య నడిగె జాతాకు జిల్లా కృషిక్ సమాజం అధ్యక్షుడు, కార్పొరేటర్, ఆధ్యాత్మిక సాధకుడు గాదెప్ప, రైతు ప్రముఖులు పురుషోత్తం గౌడ, ఐనాథ్‌రెడ్డితో కలిసి వ్యవసాయ అధికారులు, ఇతర ప్రముఖులు ప్రారంభించారు. జాతా డీసీ కార్యాలయం ఆవరణ నుంచి గడిగి చెన్నప్ప సర్కిల్, బెంగళూరు రోడ్డు, బ్రూస్‌పేట్ పోలీస్ స్టేషన్, జైన్ మార్కెట్, హెచ్‌ఆర్ గవియప్ప సర్కిల్ మీదుగా తిరిగి డీసీ కార్యాలయానికి చేరుకుంది. జాతా పొడవున తృణధాన్యాల ప్రాముఖ్యత గురించి కలిగే లాభాల గురించి నినాదాలు మిన్నంటాయి. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాహుల్ శరణప్ప సంకనూరు, వ్యవసాయ శాఖ డీడీ మంజునాథ, దయానంద్, సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment