పనిలోకి రానందుకు కార్మికులపై దాడి
హుబ్లీ: పనిలోకి రామని చెప్పిన కార్మికులపై యథేచ్చగా దాడి చేసిన ఘటన విజయపురలోని గాంధీనగర్ ఏరియాలోని ఇటుకల బట్టీ వద్ద చోటు చేసుకుంది. సదరు బట్టీ యజమాని కేము రాథోడ్, బంధువులు ఇష్టమొచ్చినట్లుగా దాడి చేశారు. సదాశివ మాదర అలియాస్ సదాశివ బబలాది, ఉమేష్ మాదర్‌లపై దాడి చేయడంతో ప్రస్తుతం ఆ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతి రోజు కార్మికులకు రూ.600 చొప్పున కూలీ చెల్లించేవాడు. సంక్రాంతి రోజు ఇంటికి వెళ్లిన కార్మికులు తిరిగి ఈనెల 16న బట్టీకి చేరుకున్నారు. వచ్చిన వారు తమ సామాన్లను సర్దుకొని బయటకు వెళ్తుండటంతో గమనించిన యజమాని వేరే చోటకు పనికి వెళ్తున్నారా? అని తోసేయడమే కాక తన మందీ మార్బలంతో దాడి చేశాడు. మూడు రోజుల పాటు గదిలో పెట్టి పైపులతో వెన్ను, కాళ్లు, నడుములపై ఇష్టానుసారంగా దాడి చేసినట్లు బాధితులు వాపోయారు. కాగా వారిని కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నిందితుల అరెస్ట్‌కు చర్యలు
కార్మికులపై జరిగిన దాడి దారుణం అని, తక్షణమే బాధ్యులైన నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని విజయపుర జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎంబీ పాటిల్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ విషయమైన ఆయన విధానసౌధలో మాట్లాడుతూ ఈ దాడి ఖండనీయం అన్నారు. ఘటనపై ఎస్పీతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నానన్నారు. నిందితులపై ఇప్పటికే కేసు నమోదైందన్నారు. ఏపీఎంసీ పరిధిలోని బావికట్టి తాండాలో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ముగ్గురూ దళిత వర్గాలకు చెందిన బాధితులన్నారు. నిందితులను అరెస్ట్ చేసిన తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతేగాక ఈ విషయమై జిల్లాధికారితో చర్చించానన్నారు. బాధ్యుడైన బట్టీ యజమాని కేము రాథోడ్ ఇప్పటికే రాజీ యత్నాలకు ప్రయత్నించాడు. అయితే దీనికి అవకాశం ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లుగా మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment