రైలు మార్గం మార్చాలని రైతుల ధర్నా
సాక్షి,బళ్లారి: దేశంలో పేరుగాంచిన ప్రముఖ ఉక్కు పరిశ్రమ జిందాల్ సంస్థకు మేలు చేసేందుకు చిన్న, సన్నకారుల రైతుల కడుపుకొట్టి భూములు లాక్కొని రైలు మార్గం నిర్మించరాదని రైతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం పలు రైతు సంఘాల ఆధ్వర్యంలో హద్దినగుండు నుంచి హలకుంది వరకు నూతనంగా నిర్మించనున్న రైలు మార్గాన్ని మార్పు చేయాలని ఆంధ్రాళ్, బీ.గోనాళ్, బొబ్బుకుంట తదితర గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ర్యాలీ చేపట్టి జిల్లాధికారి కార్యాలయానికి చేరుకొని ధర్నా చేపట్టారు. ఈ రైలు మార్గం నిర్మాణం చేపడితే ఒక ఎకరం, రెండు ఎకరాలు ఉన్న చిన్నకారు రైతులు వందలాది మంది భూములు కోల్పోయి జీవనాధారం లేక వీధిన పడతారన్నారు. ఈ ప్రాంతం గుండా వెళ్లే రైలు మార్గంలో ఎస్టీ రైతులే అధిక సంఖ్యలో ఉన్నారు, నష్టపోయేది కూడా పేద రైతులే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నగర శివార్లలో రింగ్ రోడ్డు, బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం చాలా మంది రైతులు భూములు కోల్పోయారన్నారు.
ఉన్న ఉపాధీ లేకుండా పోతుంది
ప్రస్తుతం ఈ రైల్వే ట్రాక్ నిర్మాణం చేపడితే ఉన్న ఉపాధి కూడా లేకుండా పోతుందన్నారు. ఇందుకోసం గ్రామీణ ప్రాంతమైన హగరి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత నుంచి మొదలుకొని ఓబుళాపుర గ్రామం వద్దకు మార్పు చేయాలని కేంద్ర రైల్వే శాఖమంత్రికి జిల్లాధికారి కార్యాలయం ద్వారా రైతులు వినతిపత్రం సమర్పించారు. బడా స్ట్రీల్ ఇండస్ట్రి కోసం సన్నకారు రైతులకు అన్యాయం చేయరాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూస్వాధీన ప్రక్రియను వ్యతిరేకిస్తామని మండిపడ్డారు. రైల్వే ట్రాక్ నిర్మాణం జరిగితే ఈ ప్రాంతంలో రైతులు నష్టపోవడమే కాకుండా అభివృద్ధి కూడా పూర్తిగా స్తంభించి పోతుందన్నారు. ఎవరి లబ్ధి కోసం ఈ ట్రాక్ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారని, జిందాల్ సంస్థకు మేలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. రైతు సంఘం నాయకులు చంద్రశేఖర్‌గౌడ, మాజీ డిప్యూటీ మేయర్ శశికళ కృష్ణమోహన్, దొడ్డబసనగౌడ, నాగరాజు, మారెణ్ణ తదితరులు పాల్గొన్నారు.
జిందాల్ కోసం మా కడుపు కొట్టొద్దని మండిపాటు
మార్పు చేయక పోతే పెద్ద ఎత్తున
ఆందోళన చేస్తామని హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment