పామాయిల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించండి
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
ఖమ్మంవన్‌టౌన్: కొణిజర్ల మండలం అంజనాపురంలో పామాయిల్ ఫ్యాక్టరీ పనులను వెంటనే చేపట్టాలని గోద్రెజ్ ఆయిల్‌ఫెడ్ అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన గోద్రెజ్ కంపెనీ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు పెరుగుతున్న నేపథ్యాన ప్రైవేట్ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అనంతరం పరిశ్రమ నిర్మాణ మ్యాప్‌ను పరిశీలించి సూచనలు చేశారు.గోద్రెజ్ కంపెనీ అధికారి సౌగత్ ఆయోగ్ తదితరులతో పాటు చావా వెంకటేశ్వరరావు, గుత్తా వెంకటేశ్వరరావు, తాతా రఘునాధ్, దుర్గాప్రసాద్, రావూరి సైదుబాబు పాల్గొన్నారు.
ప్రజల సహకారంతోనే కుష్ఠు నిర్మూలన
ఖమ్మంఅర్బన్: ప్రజలు ధైర్యంగా పరీక్షలు చేయించుకుంటే కుష్ఠు వ్యాధిని సమూలంగా నిర్మూలించవచ్చని, ఇందుకోసం గ్రామాలకు వస్తున్న సిబ్బందికి సహకరించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కళావతిబాయి కోరారు. ఖమ్మం ఖానాపురంలో కొనసాగుతున్న ఎల్‌సీడీసీ సర్వేను మంగళవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. సిబ్బంది ఇంటింటికీ వచ్చి స్పర్శ లేని మొద్దు బారిన మచ్చలు ఉన్న వారిని చికిత్స కోసం ఎంపిక చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖానాపురం పల్లె దవాఖానా డాక్టర్ శ్రేయ, ఉద్యోగులు బోజ్య, కృష్ణ, గోలి రమాదేవి, శ్రీనివాస్, తాళ్లూరి శ్రీకాంత్, చావా రజని, ప్రమీలరాణి, ఉమ, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
5నుంచి డీఈఈసీఈటీ అభ్యర్థులకు కౌన్సెలింగ్
ఖమ్మం సహకారనగర్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్టు(డీఈఈసీఈటీ)లో అర్హత సాధించిన విద్యార్థులకు డైట్‌లో ప్రవేశాలు కల్పించేలా రెండో విడత కౌన్సెలింగ్ ఈనెల 5నుంచి నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణ తెలిపారు. అభ్యర్థులు 5నుంచి జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైతే 7నుంచి 9వ తేదీ వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశముంటుందని వెల్ల డించారు. అలాగే, 13వ తేదీన సీటు కేటాయించనుండగా, ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి ఈనెల 13నుంచి 17వ తేదీ వరకు కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, కన్వర్షన్ ఆధారిత సీటు కేటాయింపు ఈనెల 18న జరుగుతుందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు deecet. cdse. telangana. gov. in వెబ్‌సైట్‌లో పరిశీలించాలని సూచించారు.
ప్రకాష్‌నగర్ వంతెన
మరమ్మతులు ప్రారంభం
ఖమ్మంఅర్బన్: మూడు నెలల కిందట మున్నేటికి వచ్చిన భారీ వరదతో ఖమ్మం ప్రకాష్‌నగర్ వద్ద వంతెన దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ మేరకు వంతెనపై రాకపోకలు నిలిపివేయగా.. మంగళవారం నుంచి మరమ్మతులు ప్రారంభించారు. మునుపెన్నడూ లేని రీతిలో వచ్చిన వరదతో బ్రిడ్జి పిల్లర్ల వద్ద శ్లాబ్ పక్కకు జరిగింది. దీంతో హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణులు, ఆర్‌అండ్‌బీ ఇంజనీర్ల పర్యవేక్షణలో మరమ్మతులు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment