డీసీసీబీ ఉద్యోగులకు శుభవార్త
● లాభాల్లో నుంచి ప్రోత్సాహకంగా 45 రోజుల వేతనం ● బ్యాంకు పాలకవర్గ సమావేశంలో నిర్ణయం ● మొండి బకాయిలు, నకిలీ బంగారంపైనా చర్చ
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గం ఉద్యోగులకు శుభవార్త అందించింది. బ్యాంకు లాభాల్లో 45 రోజుల వేతనాన్ని ప్రోత్సాహకంగా అందించాలని నిర్ణయించింది. అంతేకాక ఉద్యోగి ఎవరైనా మరణిస్తే అందించే దహన సంస్కారాల ఖర్చులను రూ.10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. డీసీసీబీ పాలకవర్గ సమావేశం మంగళవారం చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఖమ్మంలోని ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా గత ఏడాది బ్యాంకు రూ. 3.49 కోట్ల లాభాలను సాధించగా, ఏటా ఉద్యోగులకు ప్రోత్సాహకాలు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి 100 రోజుల ప్రోత్సాహం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతుండగా చర్చించిన పాలకవర్గం గత ఏడాదిలాగే ఈసారి కూడా 45 రోజుల వేతనాన్నే అందించాలని నిర్ణయించింది. దీంతో లాభంలో సుమారు రూ.2 కోట్లకు పైగా నగదును దాదాపు 450 మంది ఉద్యోగులకు చెల్లించున్నారు.
బకాయిలు, రుణాలపై సమీక్ష
కొంత కాలంగా పేరుకుపోయిన మొండి బకాయిలతో పాటు ఇటీవల నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారి విషయమై పాలకవర్గం చర్చించింది. ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలను వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా వసూలు చేస్తే ఫలితముంటుందని పలువురు డైరెక్టర్లు అభిప్రాయపడ్డారు. అలాగే, నకిలీ బంగారం తాకట్టు పెట్టిన వారికి రుణాలు ఎలా ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో బ్యాంకు సీఈఓ వెంకటఆదిత్య, జనరల్ మేనేజర్ వసంతరావుతో పాటు డీజీఎంలు, ఏజీఎంలు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment