నేడు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఖమ్మం చేరుకోనున్న ఆయన పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆతర్వాత సాయంత్రం 4గంటలకు 57వ డివిజన్ రమణగుట్టలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
మెరుగైన వైద్యసేవలు అందించండి
సత్తుపల్లిటౌన్: ప్రభుత్వాస్పత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అదనపు కలెక్టర్ శ్రీజ సూచించారు. సత్తుపల్లి ఏరియా ప్రభుత్వాస్పత్రిలో శనివారం తనిఖీ చేసిన ఆమె వార్డుల్లో పరిశీలించి మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. కాగా, వంద పడకలతో నిర్మిస్తున్న నూతన భవనం ఎప్పటిలోగా పూర్తవుతాయని ఆరాతీయగా పది రోజుల్లో అప్పగిస్తామని కాంట్రాక్టర్ తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, వైద్యులు సురేష్ నారాయణ్, ప్రేమలత, వసుమతీదేవి, జయలక్ష్మి, ఉద్యోగులు రామలక్ష్మి, రాధాకృష్ణకుమారి, హైమావతి, దుర్గ, శారద పాల్గొన్నారు.
వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
సత్తుపల్లి: జూనియర్ న్యాయవాదులు నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా వృత్తిలో రాణించొచ్చని ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ మెంబర్, హైకోర్టు సీనియర్ న్యాయవాది పి.విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. సత్తుపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తేళ్లూరి ఆడమ్స్ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీనియర్ న్యాయవాదుల వద్ద జూనియర్లు వృత్తి మెళకువలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏజీపీ గొర్ల రామచంద్రారెడ్డితో పాటు న్యాయవాదులు పిన్నం జానకీరామారావు, కంచర్ల వెంకటేశ్వరరావు, షేక్ బుజ్జీ సాహెబ్, సోమిశెట్టి శ్రీధర్, రమేష్, శిరీష, అరుణ, ప్రసాద్‌రెడ్డి, వంకదారు రామకృష్ణ పాల్గొన్నారు.
కనకగిరి గుట్టలను సందర్శించిన డీఎఫ్‌ఓ
చండ్రుగొండ: చండ్రుగొండ మండలం బెండాలపాడు శివారులో విస్తరించి ఉన్న కనకగిరి గుట్టలను ఖమ్మం డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్ శనివారం సందర్శించారు. గుట్టల పైభాగం వరకు వెళ్లిన ఆయన అక్కడి నుంచి ప్రకృతి అందాలను వీక్షించారు. అలాగే, గుట్టల పైభాగంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనులు, హస్తాల వీరన్నస్వామి ఆలయం నుంచి పులిగుండాల వరకు రహదారి నిర్మాణాన్ని పరిశీలించారు. డీఎఫ్‌ఓ వెంట తల్లాడ రేంజర్ ఉమ, డిప్యూటీ రేంజర్ సురేష్, బీట్ ఆఫీసర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా ఆహారోత్సవం
ఖమ్మం అర్బన్: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో శనివారం తెలంగాణ ఆహారోత్సవం నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పౌష్టికాహారంపై అవగాహన పెంచాలనే లక్ష్యంతో వారినే ఆహారం సిద్ధం చేసుకుని రావాలని అధికారులు సూచించారు. తద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి అవగాహన పెరుగుతుందనే భావనతో ఈ కార్యక్రమం చేపట్టగా తల్లిదండ్రులు ఉత్సాహంగా హాజరయ్యారని జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ రాజశేఖర్ తెలిపారు. ఖమ్మం ఇందిరానగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ఉపాధ్యాయుల కృషికి తల్లిదండ్రులు కూడా షమకరించాలని సూచించారు. పాఠశాల హెచ్‌ఎం మంజుల, ఉపాధ్యాయులు హరిప్రసాద్, స్నేహ, శాంతి తదితరులుపాల్గొన్నారు.
మృత్యువుతో పోరాడి ఓడిన వార్డు ఆఫీసర్
సత్తుపల్లిటౌన్: పురుగుల మందు తాగిన వ్యక్తికి 21రోజులుగా చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వేంసూరు మండలం మర్లపాడుకు చెందిన తోట గణేష్(24) సత్తుపల్లి మున్సిపాలిటలో ఒకటో వార్డు ఆఫీసర్‌గా 2022 ఆగస్టు నుంచి పని చేస్తున్నారు. గత నెల 30వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయాన ఆయన పురుగుల మందు తాగగా ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స చేయిస్తుండగా హైదరాబాద్ ఆస్పత్రిలో శనివారం మృతి చెందాడు. గణేష్ తండ్రి పదేళ్ల క్రితం మృతి చెందగా కారుణ్య నియామకంలో ఆయనకు ఉద్యోగం లభించింది. గతేడాది తల్లి సైతం గుండెపోటుతో మృతి చెందింది. ప్రస్తుతం గణేష్‌కు సోదరి మాత్రమే ఉండగా, ఆయన మతిపై సత్తుపల్లి మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment