విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం
ముదిగొండ: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూనే పౌష్టికాహారం అందేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని డీఈఓ సోమశేఖరశర్మ సూచించారు. మండలంలోని న్యూలక్ష్మీపురం కేజీబీవీ, జెడ్పీహెచ్‌ఎస్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు రికార్డులు, వంటి గది, స్టోర్‌రూంలో పరిశీలించాక విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టిన డీఈఓ ఆతర్వాత ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజ నాన్ని అందేలా చూడాలని, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె నేపథ్యాన బోధనకు ఇబ్బంది లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఎంఈఓ రమణయ్య పాల్గొన్నారు.
సదరమ్ క్యాంపుల షెడ్యూల్ విడుదల
ఖమ్మంవైద్యవిభాగం: వివిధ నియోజవర్గాల దివ్యాంగుల కోసం ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించే సదరమ్ క్యాంపుల షెడ్యూల్‌ను విడుదల చేశారు. వైరా నియోజకవర్గ దివ్యాంగులకు ఈనెల 23న, సత్తుపల్లి నియోజకవర్గ వారి కోసం ఈనెల 27న, మధిర నియోజకవర్గ దివ్యాంగులకు జనవరి 2న, ఖమ్మం నియోజకవర్గంలోని దివ్యాంగులకు జనవరి 9, పాలేరు నియోజకవర్గ దివ్యాంగుల కోసం జనవరి 17న క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎల్.కిరణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు దివ్యాంగులు స్లాట్ బుక్ చేసుకున్న రశీదు, ఆధార్‌కార్డ్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు మెడికల్ రిపోర్టులు వెంట తీసుకురావాలని సూచించారు.
మంచుకొండ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ సస్పెండ్
ఖమ్మంవైద్యవిభాగం: రఘునాథపాలెం మండలం మంచుకొండ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేస్తూ శనివారం డీఎంహెచ్‌ఓ కళావతిబాయి ఉత్తర్వులు జారీ చేశారు. గత మంగళవారం పీహెచ్‌సీలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తనిఖీ చేశారు. ఆయన మధ్యాహ్నం 3గంటలకు వెళ్లగా 15 మంది ఉద్యోగులకు గాను ముగ్గురే ఉన్నారు. ఇద్దరు డాక్టర్లు గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి పని చేయడం ఇష్టం లేకపోతే సెలవుపై వెళ్లాలని సూచించారు. ఆపై డీఎంహెచ్‌ఓను విచారణకు ఆదేశించగా ఆమె మెడికల్ ఆఫీసర్ శ్రీదేవిని సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
మహిళా గురుకులంలో నాక్ బృందం
కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను నాక్ బృందం సభ్యులు పరిశీలించారు. బృందం చైర్మన్ డాక్టర్ నరేష్ కేశ్‌వాలా నేతృత్వాన డాక్టర్ సి.తిలకం, డాక్టర్ భరత్ ఖండార్‌తో పాటు ట్రైబల్ వెల్పేర్ ఓఎస్‌డీ సతీష్ గౌడ్ తదితరులు రెండు రోజుల పాటు కళాశాలలో అన్ని అంశాలను పరిశీలించి నివేదికలు రూపొందించారు. బోధన, ఫలితాలు, విద్యార్థినుల ఆరోగ్యం, వసతిగృహం నిర్వహణ, భోజన సదుపాయంపై వివరాలు ఆరా తీయడమే కాక బాలికల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థినుల అభిప్రాయాలు సేకరించారు. ఈమేరకు నివేదిక ఉన్నతాధికారులను అందిస్తామని తెలిపారు. గురకులాల ఆర్‌సీఓ కె.నాగార్జునరావు, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.మాధవి, ప్రిన్సిపాల్ డాక్టర్ డి శ్రీవాణి, వైస్ ప్రిన్సిపాల్ ఎం.నవ్యతో పాటు అధ్యాపకులు ప్రజ్ఞ, ఐశ్వర్యరాణి, ఏఓ కె.వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల నియామకంపై కేఎంసీలో విచారణ
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగంలో రెండేళ్ల క్రితం ఔట్ సోర్సింగ్ విధానంలో జరిగిన కార్మికుల నియామకాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ అంశంపై విజిలెన్స్ అధికారులు గతంలో విచారణ చేయగా.. వారికి వచ్చిన అనుమానాల మేరకు మరోమారు పరిశీలించాలని మున్సిపల్ శాఖ వరంగల్ ఆర్‌జేడీని ఆదేశించారు. దీంతో ప్రస్తుత కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా, గతంలో విధులు నిర్వర్తించిన సంపత్‌కుమార్ కలిసిశనివారం కేఎంసీలో విచారణ చేపట్టారు. గతంలో కేఎంసీలో అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లుగా విధులు నిర్వర్తించిన మల్లీశ్వరి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, మల్లయ్య, బాబు, రమేష్, లాల్య పాల్గొనగా పూర్తి వివరాలు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment