అర్హులైన పేదలందరికీ గృహాలు
● రాజకీయాలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కల్లూరు/కల్లూరురూరల్: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కల్లూరు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మోడల్ గృహ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశాక ఆయన మాట్లాడారు. ఏళ్లుగా పేదలు కంటున్న కలలను తమ ప్రభుత్వం సాకారం చేయనుందని చెప్పారు. ప్రజాపాలన సభల్లో ఇళ్ల కోసం అందిన దరఖాస్తులపై సర్వే జరుగుతోందని, మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 గృహాలు మంజూరు చేస్తామన్నారు. సొంత స్థలం ఉన్నవారికి తొలివిడతలో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. కులమతాలు, పార్టీలకతీతంగా పేదలనే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామన్నారు. దశలవారీగా రూ.5లక్షల నగదును మంజూరు చేస్తామని చెప్పారు. కాగా, కల్లూరులో డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుతో పాటు ఆర్‌డీఓ కార్యాలయానికి భవనం నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
సత్తుపల్లిని జిల్లాగా మార్చండి
ఎన్నికలకు ముందు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ ఇచ్చిన హామీ మేరకు సత్తుపల్లిని జిల్లాగా మార్చాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మంత్రి పొంగులేటిని కోరారు. అంతేకాక కల్లూరును మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయాలని విన్నవించారు. అనంతరం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు, అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడారు. ఆర్‌డీఓ రాజేందర్, తహసీల్దార్ పులి సాంబశివుడు, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ హేమలత, హౌసింగ్ ఈఈ శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్లు భాగం నీరజాదేవి, ఆనంద్‌బాబు, నాయకులు మట్టా దయానంద్, పసుమర్తి చందర్‌రావు, భాగం ప్రభాకర్, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, బుక్కా కృష్ణవేణి, చెన్నారావు, ఏనుగు సత్యంబాబు, లక్కినేని కృష్ణ, యూకూబ్ అలీ పాల్గొన్నారు. కాగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తండ్రి రాఘవరెడ్డి తొమ్మిదో వర్ధంతిని ఆయన స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురంలో నిర్వహించారు. మంత్రి, ఆయన సోదరుడు ప్రసాద్‌రెడ్డిపాటు కుటుంబీకులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీగా కల్లూరు!
కల్లూరు మేజర్ గ్రామపంచాయితీ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కానుంది. ఈమేరకు మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. కల్లూ రు గ్రామపంచాయతీ 1964లో ఏర్పడగా ఆతర్వాత మేజర్ పంచాయతీగా అప్‌గ్రేడ్ అయి 30ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ హోదా కలిగిన కల్లూరు పంచాయతీ పరిధిలో 23,300 జనాభా, 13వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment