దక్కన్ ఒడిలో సింగరేణి సిరులు
రామభక్తులతో వెలుగులోకి..
భద్రాద్రి రామయ్య దర్శనానికి వెళ్లే భక్తులకు తొలిసారిగా ఇల్లెందు సమీపంలోని సింగరేణి గ్రామం దగ్గర బొగ్గు కనిపించింది. ఆ తర్వాత బ్రిటీష్ అధికారి విలియమ్స్ ఇక్కడ పరిశోధనలు చేసి నేలబొగ్గు ఉన్నట్టు 1870లో కనుగొన్నారు. దీంతో బ్రిటీషర్లు, అప్పటి నైజాం సర్కార్ సంయుక్తంగా దక్కన్ పేరుతో ఇల్లెందు ప్రధాన కేంద్రంగా బొగ్గు తవ్వకాలు ప్రారంభించారు. ఆ తర్వాత 1920 డిసెంబర్ 23న సంస్థ పేరును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చారు. అనంతరం గోదావరి లోయలో బొగ్గు నిక్షేపాలు వెదుకుతూ బెల్లంపల్లి, కొత్తగూడెంలో కోల్ మైనింగ్ ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ సంస్థను నైజాం సర్కార్ నుంచి భారత ప్రభుత్వానికి బదలాయించారు. ప్రస్తుతం సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం ఉండగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతంగా ఉంది. ఇల్లెందు సమీపంలో మొదలైన సింగరేణి ప్రస్థానం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు, బొగ్గుతో పాటు ఇతర రంగాలకూ విస్తరించింది.
ఉపాధి వనరు..
సింగరేణి సంస్థ రాకముందు నైజాం జమానాలో జమీందార్ల వెట్టి చాకిరీ కింద ఉత్తర తెలంగాణ సమాజం నలిగిపోయేది. సింగరేణి వచ్చాక ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా మెరుగైన వేతనాలు, పని ప్రదేశాల్లో సౌకర్యాలు వచ్చాయి. దీంతో ఒకప్పుడు తెలంగాణ యువతకు ఉపాధి అంటే దుబాయి, బొంబాయి, బొగ్గుబాయి అనేంతగా ప్రాచుర్యం పొందింది. 90వ దశకం ఆరంభంలో సంస్థ వ్యాప్తంగా ఏకంగా 1.20 లక్షల మంది కార్మికులు పని చేసేవారు.
తగ్గిన కార్మికులు..
1998 తర్వాత సంస్థలో యాంత్రీకరణ, ప్రైవేటీకరణ పెరగడంతో క్రమంగా కార్మికుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలో 11 ఏరియాల్లో సింగరేణి సంస్థ విస్తరించి ఉంది. దీని పరిధిలో 22 భూగర్భగనులు (యూజీ), 18 ఉపరితల గనుల (ఓసీ) నుంచి బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. సుమారు 28 వేల మంది యూజీల్లో, 11 వేల మంది ఓపెన్‌కాస్ట్ గనులు, ఇతర డిపార్ట్‌మెంట్లు, కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు.
థర్మల్ విద్యుత్‌కే సింహభాగం..
సింగరేణి సంస్థ ప్రతి ఏడాది ఉత్పత్తి చేసే బొగ్గులో 80 శాతం థర్మల్ విద్యుత్ సంస్థలకు సరఫరా చేస్తోంది. మిగతా 20 శాతం బొగ్గును సిమెంట్, స్పాంజ్ ఐరన్, పేపర్, సిరామిక్స్, ఆగ్రో, ఫార్మా తదితర పరిశ్రమలకు అందిస్తోంది. ఎనిమిది రాష్ట్రాలకు చెందిన సుమారు రెండు వేలకు పైగా పరిశ్రమలు సింగరేణి నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాయి.
విస్తరణ బాటలో..
వందేళ్ల క్రితం బొగ్గు ఉత్పత్తితో మొదలైన సింగరేణి ప్రస్థానం ఇప్పుడు నలు దిశలా విస్తరిస్తోంది. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో తొలి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సంస్థ ప్రారంభించింది. ఇప్పుడు జైపూర్ ప్లాంట్ విస్తరణతో పాటు రామగుండంలో రెండో ప్లాంట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు సోలార్ పవర్, విండ్ పవర్, బ్యాటరీ స్టోరేజ్డ్ పవర్, పంప్డ్ స్టోరేజీ హైడల్ పవర్, ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ తదితర ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. ఓఎన్‌జీసీ సహకారంతో జియో థర్మల్ పవర్ ప్లాంట్ ప్రోటోటైప్ సిద్ధం చేస్తోంది. మరోవైపు ఒడిశాలో బొగ్గు ఉత్పత్తి, రాజస్థాన్‌లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.
సంక్షేమంలో భేష్..
కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి యాజమాన్యం ప్రతీ ఏడాది ఒక్కో కార్మికుడి కుటుంబంపై సుమారు రూ.3 లక్షలు ఖర్చు చేస్తోంది. అంతేకాకుండా కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు సుమారు 150 కార్పొరేట్ ఆస్పత్రుల్లో సుమారు రూ.250 కోట్లు ఖర్చు చేసి వైద్య సౌకర్యం అందిస్తోంది. కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా విద్యా సంస్థలు నడిపిస్తోంది. వచ్చే ఏడాది నుంచి సీబీఎస్‌ఈ సిలబస్ ప్రవేశపెడుతోంది. రూపాయి కూడా ప్రీమియం చెల్లించకుండా కార్మికులకు రూ.కోటి, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.30 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తోంది.
భద్రతకు ప్రాధాన్యం
ప్రమాదకరమైన ప్రదేశాల్లో పని చేస్తూ కార్మికులు బొగ్గు ఉత్పత్తి చేస్తుంటారు. అందుకే కార్మిక రక్షణకు సింగరేణి ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా తేలిక పాటి క్యాప్‌ల్యాంప్‌లు, అన్ని గనుల్లో ఎమర్జెన్సీ ఆప్సరేటర్లు అందుబాటులో ఉంచాం. వివిధ రకాల విష వాయువుల ఉనికి కనుగొనే ఆధునిక పరికరాలు సమకూర్చాం. ఆస్ట్రేలియాకు చెందిన సింటార్స్ అనే ప్రముఖ సంస్థ ద్వారా రక్షణపై ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాం. రూ.5 కోట్లతో సిమ్యూలేటర్ల ద్వారా భారీ యంత్రాల ఆపరేటర్లకు శిక్షణ ఇప్పిస్తున్నాం.
– సత్యనారాయణరావు, డెరెక్టర్ (ఈఅండ్‌ఎం)
Comments
Please login to add a commentAdd a comment