● 40 తులాల బంగారంతో పాటు వెండి, నగదు మాయం ● సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు
ఖమ్మంక్రైం: ఖమ్మం ద్వారకానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ ప్లాట్‌లో భారీ చోరీ జరిగింది. ఘటనకు సంబంధించి టూటౌన్ సీఐ బాలకృష్ణ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లిలో విధులు నిర్వర్తిస్తున్న సింగరేణి ఉద్యోగి లకావత్ రాందాస్ ఆర్టీఓ ఆఫీస్ సమీపాన ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. వీరి ఇంట్లో వివాహం ఉండగా ఆ పనులపై శుక్రవారం అంతా ఊరు వెళ్లారు. తిరిగి శనివారం ఉదయం వచ్చేసరికి ప్లాట్ తాళం తీసి ఉండడంతో పాటు లోపల బీరువా పగలగొట్టి ఉంది. దీంతో పరిశీలించగా పెళ్లి కోసం సమకూర్చుకున్నవే కాక బంధువులు ఆభరణాలు కలిపి 40 తులాలకు పైగా బంగారం, అరకేజీ వెండి, రూ.లక్ష నగదు కలిపి రూ.12లక్షల సొత్తు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈమేరకు అందిన సమాచారం టూటౌన్ పోలీసులు క్లూస్ టీం ఆధారాలు సేకరించగా, సీసీ టీవీ పుటేజీ కూడా లభించడంతో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, చోరీకి ఒకే వ్యక్తి రాగా ప్లాట్‌లో 40 నిమిషాల పాటు ఉన్నట్లు సీసీ టీవీ పుటేజీ ద్వారా గుర్తించారు. కాగా, అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మెన్ ఉన్నప్పటికీ సదరు నిందితుడు అర్ధరాత్రి దాటాక దర్జాగా 4వ అంతస్తులోని ప్లాట్‌లోకి ప్రవేశించి చోరీ చేయడం గమనార్హం.
ప్రభుత్వ ఉద్యోగుల ఇంట్లో...
ఖమ్మం ముస్తఫానగర్‌లో శనివారం చోరీ జరిగింది. ముస్తఫానగర్‌కు చెందిన ఆర్టీసీ కంట్రోలర్ శ్రీనివాసరావుతో పాటు ప్రభుత్వ ఉద్యోగే అయిన ఆయన భార్య విధి నిర్వహణ నిమిత్తం ఈనెల 18న వెళ్లారు. తిరిగి శనివారం వచ్చే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోపల బీరువాలో దాచిన రూ.1.92 లక్షల నగదు చోరీకి గురైనట్లు తేలగా బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఉదయ్‌కుమార్ తెలిపారు.
ముత్యాలమ్మ తల్లి ఆలయంలో..
పెనుబల్లి: పెనుబల్లిలోని ముత్యాలమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఆలయంలోని హుండీ పగులగొట్టి రెండు నెలలుగా భక్తులు వేసిన కానుకలు ఎత్తుకెళ్లారు. అంతేకాక గ్రామంలోని పలుచోట్ల షాపుల తాళాలు పగులగొట్టి చోరీకి విఫలయత్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment