● ఇటిక్యాల.. కిటుకులతో బోధన
నేలకొండపల్లి: గణితం అంటే చాలామంది విద్యార్థులకు భయం ఉంటుంది. కానీ సమస్యలను పరిష్కరించే సూత్రాలపై పట్టుసాధిస్తే అన్ని సబ్జెక్టులతో పోలిస్తే సులువుగా మారే గణితంతో అత్యధిక మార్కులు సాధించే అవకాశముంటుంది. ఈమేరకు విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెంచేలా బోధిస్తున్నారు నేలకొండపల్లి మండలంలోని కట్టుకాచారం పాఠశాల గణిత ఉపాధ్యాయుడు ఇటిక్యాల సురేష్. వినూత్న విధానాలు, సులువైన పద్ధతుల్లో పరిష్కారం అవగాహన కల్పిస్తున్న ఆయన పలు అవార్డులు సాధించారు. గణిత టాలెంట్ టెస్ట్‌లు, మేళాలు, క్విజ్ పోటీలు ఎక్కడ జరిగినా విద్యార్థులు పాల్గొనేలా తర్ఫీదు ఇస్తున్నారు. సులువైన విధానాల్లో లెక్కలు చేసే విధానంపై వివరిస్తూ వారిని తీర్చిదిద్దుతున్నారు. ఏ పాఠశాలలో పనిచేసినా సురేష్ ప్రత్యేక పరికరాలు రూపొందించి మరీ బోధిస్తుండడంతో విద్యార్థులు సబ్జెక్టు పరీక్షలోనే కాకుండా పోటీ పరీక్షల్లోనూ సత్తా చాటుతున్నారు. కాగా, 20ఏళ్లుగా గణితం రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తున్న ఆయన స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించారు. 2003లో గణితం టీఎల్‌ఎం మేళాకు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. సంఖ్యా వినోదం, సమాన భాఽగాలు, భాగాహార ప్రక్రియ, త్రిభుజ ధర్మాలు, నేపియర్ స్టిప్స్‌తో గుణకార భావనలు, జియోబోర్డు ద్వారా జ్యామితీయ చిత్రాలు తదితర టీఎల్‌ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్) ఆయన అవార్డులు తెచ్చిపెట్టాయి. అంతేకాక 1999లో మైసూర్ యూనివర్సిటీ నుంచి అవార్డు అందుకున్న సురేష్ అటు విద్యార్థులు, ఇటు అధికారుల మన్ననలు అందుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment