● జిల్లాలో ప్రస్తుతం 37,152 దరఖాస్తులు పెండింగ్ ● నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన
ఖమ్మం సహకారనగర్: అర్హులైన లబ్ధిదారులకు ఇకపై కొత్త రేషన్‌కార్డులు అందనున్నాయి. ఏళ్ల తరబడి దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న వారి కల ఎట్టకేలకు ఫలించనుంది. కొద్దినెలల క్రితం నిర్వహించిన ప్రజాపాలన సభల్లో రేషన్‌కార్డుల కోసం కూడా దరఖాస్తులు స్వీకరించారు. తాజాగా జరిగిన ఇంటింటా కులగణన సర్వేలోనూ రేషన్‌కార్డుల లేని వారి వివరాలు సేకరించారు. ఇంతలోనే ఈనెల 26వ తేదీన జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. దీంతో గురువారం నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఖమ్మం అర్బన్‌లో అత్యధికం
జిల్లాలోని 21మండలాల పరిధిలో 37,152 కుటుంబాలు రేషన్‌కార్డులు అవసరమని దరఖా స్తులు సమర్పించాయి. ఇందులో అత్యధికంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(ఖమ్మం అర్బన్) పరిధిలో 5,295దరఖాస్తులు రాగా.. తక్కువగా మధిర మున్సిపాలిటీ పరిధిలో 767దరఖాస్తులు వచ్చాయి. వీటి ఆధారంగా సర్వే చేపట్టి అర్హులకు రేషన్‌కార్డులు జారీ చేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ తెలిపారు.
ఇవీ విధివిధానాలు
మండల స్థాయిలో ఎంపీడీఓ, మున్సిపాలిటీల్లో కమిషనర్ ఆధ్వర్యాన సర్వే నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) / డీసీఓ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. సర్వేలో అర్హులుగా గుర్తించిన ముసాయిదా జాబితాలను గ్రామసభ, వార్డు సభలో ప్రదర్శించి చర్చించాక ఆమోదిస్తారు. ఆపై వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి కలెక్టర్‌కు పంపిస్తే అక్కడ ఆమోదం తర్వాత సివిల్ సప్లయిస్ కమిషనర్‌కు చేరుతుంది. అంతరం లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. అయితే, అర్హులైన వ్యక్తి పేరు ఒకే రేషన్ కార్డులో ఉండేలా అధికారులు పర్యవేక్షిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment