అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కూసుమంచి: మండలంలోని లోక్యాతండాకు చెందిన రైతు వడిత్య నవీన్‌కుమార్(33) అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. నవీన్ కుమార్ తనకు ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూనే మామిడి మొక్కల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వ్యవసాయం, వ్యాపారం కోసం చేసిన అప్పులు పెరిగి, వాటిని తీర్చాలని ఒత్తిడి వస్తుండడంతో పది రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోగా, శుక్రవారం ఆయన కౌలుకు తీసుకున్న చేనులో నవీన్‌కుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆయన మృతదేహం పక్కన గడ్డి మందు డబ్బా ఉండడంతో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భావించి ఆయన భార్య స్వాతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
లారీ యజమాని..
ఖమ్మంఅర్బన్: ఖమ్మం దానవాయిగూడెంకు చెందిన లారీ యజమాని బోడా రమణ(50) అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లారీ నడుపుతూ జీవనం సాగించే ఆయనకు ఇటీవల సరైన కిరాయిలు రాక ఫైనాన్స్ కిస్తీ చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఈనేపథ్యాన ఎవరూ లేని సమయాన ఇంటి ఆవరణలో బలవన్మరణానికి పాల్పడగా రమణ భార్య ఫిర్యాదుతో శుక్రవారం ఖమ్మం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కుటుంబ కలహాలతో మహిళ..
మధిర: కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మధిర మండలం జిలుగుమాడులో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జానీ, మీనా(30) దంపతులు కొంతకాలంగా జిలుగుమాడు లో పాల సేకరణ కేంద్రం నడుపుతూనే మధిర బంజారా కాలనీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద పాలు విక్రయిస్తున్నారు. ఈక్రమాన భార్యాభర్తల మధ్య జరిగిన వివాదంతో మనస్థాపానికి గురైన మీనా ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై మధిర టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment