● మున్సిపల్ కార్మికులకు అందని జీతాలు ● ప్రభుత్వం విడుదల చేసినా ట్రెజరీ శాఖ అడ్డంకులు
ఖమ్మంమయూరిసెంటర్: మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులను వేతన కష్టాలు వేధిస్తున్నాయి. ప్రతినెలా ఒకటో తేదీన విడుదలయ్యే వేతనాలు.. ఈసారి 17వ తేదీ వచ్చినా అందలేదు. వచ్చే అతితక్కువ వేతనాలు కూడా జమ కాకపోవడంతో కార్మికులు సంక్రాంతి పండుగ సైతం అప్పులు చేసి జరుపుకోవాల్సి వచ్చింది. వీరికి ఇన్నాళ్లు మున్సిపాలిటీల జనరల్ ఫండ్ నుంచి నేరుగా వేతనాలు చెల్లించేవారు. అయితే ఈసారి ట్రెజరీ నుంచి పారిశుద్ధ కార్మికులు, ఇతర సిబ్బందికి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కమిషనర్లు ట్రెజరీలకు చెక్కులు పంపినా అక్కడ అభ్యంతరాలతో ఆలస్యం జరుగుతోంది.
2019 ద్వారా ట్రాన్స్‌ఫర్ డ్యూటీ నిధులు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యాన జరిగే ప్రతీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌లో ప్రభుత్వంకు వచ్చే ఆదాయంలో 7శాతం నిధులను స్థానిక సంస్థలకు కేటాయిస్తుంటారు. అర్బన్ లోకల్ బాడీస్‌కు ఈ విధంగా వచ్చే నిధులను 2019 ఏడాది నుండి ఇవ్వడం లేదు. దీంతో మున్సిపాలిటీలకు ఆదాయం తగ్గి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యాన రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మున్సిపాలిటీలకు నిధులు విడుదలయ్యాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.27 కోట్లకు పైగా ట్రాన్ ్సఫర్ డ్యూటీ నిధులు విడుదలైనట్లు తెలుస్తోంది. కేఎంసీతో పాటు ఉమ్మడి జిల్లాలోని మధిర, సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు మున్సిపాలిటీలకు రూ.3 కోట్ల నుండి రూ.15 కోట్ల వరకు నిధులు విడుదలైనట్లు సమాచారం.
వేతనాలు చెల్లించాలని..
ప్రభుత్వ ఆదేశాలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మున్సిపాలిటీలకు విడుదల చేసిన నిధులను వేతనాలు చెల్లింపునకు వినియోగించాలని సీడీఎంఏ కమిషనర్ టి.కె.శ్రీదేవి ఈ నెల 6న ఆదేశించారు. మున్సిపాలిటీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని, వీటితో పాటు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ బకాయిలను చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కార్మికుల ఎదురుచూపులు..
సీడీఎంఏ నుంచి వచ్చిన ఉత్తర్వుల కాపీలతో పాటు చెక్కులనుమున్సిపల్ కమిషనర్లు ట్రెజరీ అధికారులకు పంపించారు. అయితే పలు కారణాలు చూపుతూ ట్రెజరీ శాఖ అధికారులు చెక్కులను పక్కన పెట్టినట్లు తెలిసింది. ఈనెల 7న ట్రెజరీలకు చెక్కులు పంపించినా ఇప్పటి వరకు కార్మికుల ఖాతాల్లో జమ చేయలేదు. రాష్ట్ర కమిషనర్లు, ట్రెజరీ డైరెక్టర్లు ఆదేశించినా క్షేత్ర స్థాయిలో ఎస్టీఓలు వీటిని అడ్డుకుంటున్నారని సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కేఎంసీలో 1,012 మంది కార్మికులు, ఇతర మున్సిపాలిటీల్లో మరో 500 మంది కార్మికులు ఉన్నారు. వీరందరికీ ఈనెల 17వ తేదీ నాటికి వేతనాలు అందకపోవడంతో పండుగ వేళ నిరాశకు లోనయ్యారు. ఇకనైనా ట్రెజరీ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి తమకు వేతనాలు ఇప్పించాలని పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బంది కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment