గరిడేపల్లి: టాటా ఏస్ వాహనాన్ని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన గురువారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అబ్బిరెడ్డిగూడెం క్రాస్ వద్ద జరిగింది. ఖమ్మం జిల్లా తల్లంపాడుకు చెందిన దేరంగుల సురేష్, ఆయన సోదరి దేరంగుల యమున సంక్రాంతి పండుగకు సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దిర్శంచర్లలోని బంధువుల ఇంటికి వచ్చారు. గురువారం తిరిగి స్వగ్రామానికి స్కూటీపై బయలుదేరగా గరిడేపల్లి మండలం అబ్బిరెడ్డిగూడెం క్రాస్ వద్ద ముందు వెళ్తున్న టాటా ఏస్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వీరు ఢీకొట్టారు. ఈ ఘటనలో సురేష్, యమునకు తీవ్ర గాయాలు 108లో హుజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు.
సాగర్ కాల్వలో వ్యక్తి గల్లంతు
ఖమ్మంరూరల్: మద్యానికి బానిసవడంతో పాటు కడుపునొప్పి భరించలేని ఓ వ్యక్తి సాగర్ కాల్వ దూకగా గల్లంతయ్యాడు. రూరల్ మండలం కరుణగిరి లోని దివ్యాంగుల కాలనీకి చెందిన సంగోజు పుల్లాచారి(50) కొంతకాలంగా మద్యానికి బానిసై అనారో గ్యం పాలయ్యాడు. దీంతో కడుపునొప్పి వస్తుండగా తట్టుకోలేని ఆయన ఆత్మహత్య చేసుకుంటానంటూ గురువారం ఇంట్లో చెప్పి సాగర్ కాల్వ వద్దకు చేరుకున్నాడు. అక్కడ అందరూ చూస్తుండగానే కాల్వలోకి దూకిన ఆయన గల్లంతయ్యాడు. ఈమేరకు సమాచారం అందుకున్న పుల్లాచారి భార్య మదనబాయమ్మ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఐదు ఇసుక ట్రాక్టర్ల సీజ్
ముదిగొండ: మండలంలోని పెద్దమండవ మున్నేరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు గురువారం సీజ్ చేశారు. వనంవారి కిష్టాపురం వద్ద ఎస్‌ఐ అనంతరాములు ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టగా ఇసుక తరలింపు అనుమతి లేదని తేలడంతో సీజ్ చేశామని సీఐ మురళి తెలిపారు. ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులు కలిపి 10మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఠాణా ఎదుట గుమిగూడిన జనం
కొత్తగూడెంఅర్బన్: బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్‌పై దాడి ఘటనలో ప్రమేయం లే ని వ్యక్తిపై కూడా కేసు పెట్టారని బంధువులు కొత్తగూడెం త్రీటౌన్ పోలీసు స్టేషన్ ఎదుట గురువారం గుమిగూడారు. ఇటీవల బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ చంద్రశేఖర్‌పై దాడి చేసిన ఘటనలో ఉదయ్ అనే వ్యక్తి దాడిని అడ్డుకున్నాడని, అతనిపై కేసు నమోదు చేయడం సరికాదంటూ బంధువులు ఆందోళన చేయడానికి సిద్ధపడ్డారు. స్టేషన్ వద్దకు భారీగా జనాలు చేరారు. అనంతరం అక్కడి నుంచి కోర్టు వద్దకు వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment