వీధికుక్క దాడిలో చిన్నారికి తీవ్రగాయాలు
జిల్లా కేంద్రంలోని శివకేశవ మందిర్ వీధిలో శుక్రవారం ట్యూషన్ వెళ్తున్న విద్యార్థులపై వీధి కుక్కలు దాడికి ప్రయత్నించాయి. కుక్కకాటు నుంచి ఓ విద్యార్థి తృటిలో తప్పించుకున్నాడు. జిల్లా కేంద్రంలో దాదాపు ప్రతీ వీధిలో కుక్కల గుంపులు ఉన్నాయి. జిల్లాలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమయ్యాయి. రోడ్లపై తిరుగుతున్న వీధికుక్కలు రెచ్చిపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఇంటి నుంచి బయటికి వెళ్తే కోతులు, శునకాల నుంచి రక్షణకు కర్రలు తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఆసిఫాబాద్: జిల్లాలో పిచ్చికుక్కలు నిత్యం చిన్నారులు, వృద్ధులుపై దాడులకు దిగుతున్నాయి. కొన్నిరోజులుగా తీవ్రస్థాయిలో గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఉదయం నుంచే రోడ్లపైకి చేరి పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులతోపాటు ఆడుకుంటున్న పిల్లలపై దాడులు చేస్తున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు.
రోడ్లపైనే సంచారం..
జిల్లాలో 335 పంచాయతీలతోపాటు కాగజ్‌నగర్ మున్సిపాలిటీ ఉంది. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామాల్లో సైతం వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన మార్కెట్‌తోపాటు శివకేశవమందిర్, తారకరామానగర్, బజార్‌వాడి, ఇతర కాలనీల్లో పగలు రాత్రి తేడా లేకుండా దర్శనమిస్తున్నాయి. చిన్న పిల్లలపైనే అధికంగా దాడులకు దిగుతుండటంతో తల్లిదండ్రులు కర్రలతో రక్షణ వెళ్లాల్సి వస్తోంది. శునకాల సంతతి నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో వారి పర్యవేక్షణ కొరవడుతోంది. వీధి కుక్కల సమస్య పరిష్కారానికి హేతుబద్ధమైన పరిష్కారం కనుగొనాలని గతంలో సుప్రీం కోర్టు పేర్కొన్నా జిల్లాలో మాత్రం అవసరమైన చర్యలు కానరావడం లేదు.
కోతుల బెడద అధికంగానే..
జిల్లా కేంద్రంలో కుక్కలతోపాటు కోతులు సైతం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇంటి తలుపులు తెరిచిఉంటే చాలు లోపలికి ప్రవేశించి సామగ్రిని చిందరవందర చేస్తున్నాయి. ఆహార పదార్థాలతోపాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. ఇంటి పరిసరాల్లో పెంచుకుంటున్న కూరగాయలు, పండ్ల మొక్కలను నాశనం చేస్తున్నాయి. కొన్ని నెలల వ్యవధిలోనే కోతుల దాడిలో గాయపడి న వారి సంఖ్య పదుల సంఖ్య దాటింది. మూడు రోజుల క్రితం సాయినగర్‌కు చెందిన ఓ వ్యాపారిపై కోతి దాడి చేయగా ఆయన చేతికి గాయమైంది. కో తుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో కిందప డి గాయపడిన వారూ ఉన్నారు. జిల్లా కేంద్రంలో కో తులు, కుక్కల నియంత్రణ చర్యలు తీసుకుంటామ ని, వాటిని పట్టుకునే వారికి సమాచారం ఇచ్చామని పంచాయతీ కార్యదర్శి వంశీకృష్ణ తెలిపారు.
కుక్కకాటు కేసులు ఇలా..
● జిల్లాలో ఏటా వందలాది మంది పిచ్చికుక్కల దాడికి గురవుతున్నారు. గత నెలలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలోనే 33 మంది కుక్కకాటుకు చికిత్స పొందారు. గ్రామాల్లో నాటు వైద్యం చేయించుకునే వారు ఇంకా ఎక్కువ మంది ఉంటారని తెలుస్తోంది.
● రెబ్బెన మండలంలో గడిచిన మూడు నెలల్లో 33 కేసులు నమోదయ్యాయి.
● దహెగాం మండలంలో మూడు నెలల్లో 32 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. గ్రామాల్లో శునకాలు గుంపులుగా సంచరిస్తున్నా పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.
● పెంచికల్‌పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మూడు నెలల్లో ఎనిమిది కుక్కకాటు కేసులు నమోదయ్యాయి.
● బెజ్జూర్ పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల్లో జూలై 13 మంది, ఆగస్టులో 14, సెప్టెంబర్‌లో 13 కుక్కకాటుతో గాయపడ్డారు.
● తిర్యాణి మండలంలో మూడు నెలల్లో 15 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి.
● కౌటాల మండలంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 20 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. మండలంలో వీధికుక్కల సంచారం అధికంగా ఉంది. నివారణ చర్యలపై పంచాయతీలు దృష్టి పెట్టడం లేదు.
● చింతలమానెపల్లి మండలంలో మూడు నెలల్లో 14 మంది కుక్కకాటుతో గాయపడ్డారు. బాబాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాధితుల కోసం వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారి తెలిపారు.
చిన్నారులపై వరుస దాడులు
తాజాగా వాంకిడి మండలంలో తీవ్రంగా గాయపడిన సర్పంచ్ కుమార్తె
శునకాల సంతతి నియంత్రణలో అధికారుల నిర్లక్ష్యం
పదుల సంఖ్యలో గుంపులుగా రోడ్లపై సంచారం
జిల్లా కేంద్రంలో వీరంగం సృష్టిస్తున్న కోతులు
అందుబాటులో వ్యాక్సిన్
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కుక్కకాటుకు సంబంధించిన యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కుక్కకాటుకు గురైన వారు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే వ్యాక్సిన్ వేస్తారు. బాధితులు ఐదు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. నాటు వైద్యంతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు.
– డాక్టర్ చెన్నకేశవ,
డీసీహెచ్, ప్రభుత్వ ఆస్పత్రి ఆసిఫాబాద్
ఇంటి బయట ఆడుకుంటుండగా దాడి ఆసిఫాబాద్, మంచిర్యాల ఆస్పత్రుల్లో అందని వైద్యం ఎంజీఎంకు వెళ్లిన బాధిత కుటుంబం
వాంకిడి(ఆసిఫాబాద్): ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్క దాడి చేసిన తీవ్రంగా గాయపర్చిన ఘటన శుక్రవారం వాంకిడి మండలం చౌపన్‌గూడ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌపన్‌గూడ సర్పంచ్ సిడాం అన్నిగా జీపీ పరిధిలోని సడక్‌గూడ గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఆయన నాలుగేళ్ల కుమార్తె వైష్ణవి శుక్రవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఇంటి బయట ఆడుకుంటుండగా ఓ వీధికుక్క దాడిచేసింది. చిన్నారి కుడి కన్ను, చెంపపై బలమైన పంటిగాట్లు పడటంతో తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు మంచిర్యాలకు తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
వైద్యం కోసం వరంగల్‌కు..
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నా అక్క డి వైద్యులు వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని చిన్నారి తండ్రి సిడాం అన్నిగా ఆరోపించారు. గంటపాటు కాలయాపన చేసి తర్వాత వరంగల్‌కు రెఫర్ చేశారని పేర్కొన్నారు. కుక్కకాటుకు ఉమ్మడి జిల్లాలో వైద్యసేవలు అందకపోవడం హేయమైన విషయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment