ప్రశాంతంగా ‘నవోదయ’ పరీక్ష
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో నిర్వహించిన జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయాల్లో ఆరోతరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష ఉదయం 11.30 గంటలకు ఉండగా విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. 10.30 గంటలకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లాలో ఆరు సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్‌లో రెండు, కాగజ్ నగర్‌లో రెండు, సిర్పూర్ (టీ) సెంటర్‌లో 1,159 మంది విద్యార్థులకు 805 మంది హజరు కాగా, 354 మంది గైర్హాజరైనట్లు నవోదయ ప్రిన్సిపాల్ పార్వతి తెలిపారు. పరీక్షా కేంద్రాలను జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు, ప్రిన్సిపాల్ పార్వతి పర్యవేక్షించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 24 సెంటర్లలో 5,191 మందికి గాను 4,167 మంది హాజరు కాగా 1,024 మంది గైర్హాజరయ్యారు.
కాగజ్‌నగర్ రూరల్: కాగజ్‌నగర్ పట్టణంలోని నవోదయ విద్యాలయం, సెయింట్ క్లారిటీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షాకేంద్రాలను కాగజ్‌నగర్ నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ పార్వతి పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సిర్పూర్(టి): మండలకేంద్రంలోని స్థానిక సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు 156 మందికి 105 మంది విద్యార్థులు హాజరయ్యారు. సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో 162 మందికి 141 మంది విద్యార్థులు హాజరైనట్లు ఎంఈవో వేణుగోపాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment