వేసవిలో ప్రాణహిత! | - | Sakshi
Sakshi News home page

వేసవిలో ప్రాణహిత!

Published Thu, Dec 12 2024 9:22 AM | Last Updated on Thu, Dec 12 2024 6:22 PM

గతంలో ప్రాజెక్టు కోసం తవ్విన కాలువలు

గతంలో ప్రాజెక్టు కోసం తవ్విన కాలువలు

డా.బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాజెక్టుకు సర్కారు పచ్చజెండా

రానున్న ఎండాకాలంలో పనులు ప్రారంభించే అవకాశం

నీటి పారుదలశాఖ మంత్రి ప్రకటనతో ఆశలు

హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా రైతులు

‘కాళేశ్వరం’ ప్రాజెక్టుతో ఉనికిని కోల్పోయిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు మళ్లీ జీవం పోసుకోనుంది. ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించేందుకు కాంగ్రెస్‌ సర్కారు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా చుట్టూ అపారమైన నీటి వనరులున్నాయి. 

కౌటాల(సిర్పూర్‌): ఉమ్మడి రాష్ట్రంలో తక్కువ ఖ ర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగు నీరందించాలనే ఉద్దేశంతో కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద 2008 డిసెంబర్‌ 16న ప్రాణహిత ప్రాజెక్టుకు శ్రీకా రం చుట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మొదలు కుని ఏడు ఉమ్మడి జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాలకు సాగు నీటిని పారించాలనేది లక్ష్యం. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత పాలకులు పదేళ్లుగా ప్రా ణహిత ప్రాజెక్టును పట్టించుకోలేదు. గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత తక్కువ ఉందని, ఈ ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించింది. ఈ తరుణంలో ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం కలగానే మిగి లిపోతుందని ఆందోళనలు మొదలయ్యాయి. ప్రస్తు త కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును మళ్లీ తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలని నిర్ణయించింది.

బడ్జెట్‌లో నిధులు..

కౌటాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్లు, అంచనాలను సవరించి రానున్న వేసవిలో శంకుస్థాపన చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మించే అంశాన్ని పునఃపరిశీలిస్తున్నారు. నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్లనున్నారు. గత డిజైన్లు, నీటి లభ్యతను సమీక్షించి బరాజ్‌ను తప్పనిసరిగా కడతామని రాష్ట్ర మంత్రి స్పష్టం చేశారు. రానున్న రెండు, మూడు నెలల్లో ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంపై స్పష్టత రానుంది. రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో ప్రాణహిత– చేవెళ్ల ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూ.248.99 కోట్ల నిధులు కేటాయించింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు నిర్మాణంపై చర్చ జరగనుంది.

వార్దానా.. తుమ్మిడిహెట్టినా..?

ప్రాణహిత– చేవేళ్ల ఎత్తిపోతల పథకంలో ప్రాణహి త నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీకి 2008లో రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో శ్రీకారం చు ట్టారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం ప్రత్యేక రాష్ట్రంలో ప్రధాన బ్యారేజీని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ వద్దకు మార్చడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు సాగునీరు అందించాలన్న లక్ష్యం నెరవేరలేదు. తుమ్మిడిహెట్టికి బదులు ప్రత్యామ్నాయంగా సమీప వార్దా నదిపై బ్యారేజీ నిర్మించాలని గత ప్రభుత్వం 2022లో నిర్ణయించింది. రూ.4,470.76 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలన అనుమతులు మంజూరైనా పనులు మొదలవ్వలేదు. ఉమ్మడి రా ష్ట్రంలో ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా 70 కిలో మీ టర్ల పొడవు కాలువల తవ్వకాలు పూర్తిచేశారు. ప్ర స్తుతం వార్దాపై ప్రాజెక్టు నిర్మిస్తారా.. ప్రాణహిత న దిపై బ్యారేజీ నిర్మిస్తారనే అనే చర్చ రైతుల్లో సాగుతోంది. ఎక్కడ బ్యారేజీ నిర్మించినా పనులు ప్రారంభించి పూర్తిచేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

16 ఏళ్లుగా నిరీక్షణ

జిల్లాలో సమృద్ధిగా నీటి వనరులు ఉన్నాయి. ప్రాణహిత, వార్దా నదులు నిత్యం జలకళతో ఉంటాయి. భారీ ప్రాజెక్టు లేకపోవడంతో ఇప్పటికీ స్థానిక సాగు అవసరాలకు చుక్క నీరందడం లేదు. 90 శాతం మంది రైతులు వర్షాధారంగానే పంటలు పండిస్తున్నాం. ప్రాణహిత ప్రాజెక్టు కోసం 16 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. త్వరగా పూర్తి చేసి పంటలకు నీరివ్వాలి.

– మడావి సంపత్‌, వీర్ధండి, మం.కౌటాల

రుణపడి ఉంటాం

ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం శుభపరిమాణం. ప్రాజెక్టును పూర్తిచేస్తే రుణపడి ఉంటాం. భూములు కోల్పోతున్న రైతులను ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. 16 ఏళ్ల క్రితమే స్థానిక రైతుల భూములు తీసుకుని కాలువలు తవ్వారు. పనులు ముందుకు సాగలేదు. ఆలస్యం చేయకుండా ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి.

– జాడి దిలీప్‌, వీర్ధండి, మం.కౌటాల

కేంద్రం నుంచి నిధులు తెస్తాం

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకొస్తే కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని గత అసెంబ్లీ సమావేశల్లో స్పష్టంగా వివరించా. రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం లేదు. తుమ్మిడిహెట్టి వద్ద కడతారా? వార్దా నదిపై కడతారా అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఈ ప్రాంతాల్లో ఎక్కడ ప్రాజెక్టు కట్టినా స్వాగతిస్తాం. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణ విధివిధానాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. రాష్ట్ర ప్రభుత్వం కాలక్షేపం చేయకుండా ప్రాణహిత ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి.

– పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్యే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement