● లక్ష్యం చేరని పన్నుల వసూళ్లు ● జిల్లా వ్యాప్తంగా 1.66 శాతమే.. ● గడుపులోపు లక్ష్యం చేరేనా?
ఆసిఫాబాద్: మరో మూడున్నర నెలల్లో 2024–25 ఆర్థిక సంవత్సరం ముగియనుండగా గ్రామపంచా యతీల్లో ఇప్పటివరకు 1.66 శాతం మాత్రమే పన్నులు వసూలయ్యాయి. ఇది గతంతో పోలిస్తే చాలా తక్కువ. జిల్లాలోని 15 మండలాల్లో 335 పంచాయతీలుండగా సుమారు లక్షకు పైగా గృహాలున్నాయి. గతేడాది గ్రామపంచాయతీల్లో రూ.2,80,32,324 పన్నుల వసూళ్లకు గాను రూ.2,47,55,821 వసూలు చేసి 88శాతం లక్ష్యాన్ని సాధించారు. ఈ ఏడాది పాత బకాయిలతో కలిపి రూ.6,16,35,947 లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.13,60,834 మాత్రమే వసూలు చేశారు. ఇది 1.66 శాతం మాత్రమే. రూ.6,02,75,113 వసూలు చేయాల్సి ఉండగా ఇంకా 98.34 శాతం పన్నులు వసూలు కావాల్సి ఉంది. జిల్లాలోని రెబ్బెన మండలంలో అత్యధికంగా 9 శాతం పన్నులు వసూలయ్యాయి. సిర్పూర్(యు), వాంకిడి మండలాలు పన్నుల వసూళ్లలో జీరో శాతంతో అట్టడుగున ఉన్నాయి.
అదనపు బాధ్యతలతోనే..
గ్రామపంచాయతీ కార్యదర్శులకు వారి విధులతో పాటు ప్రభుత్వం ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి విధులు కేటాయించారు. మొన్నటివరకు ప్ర భుత్వం చేపట్టిన సామాజిక కులగణనలో పంచా యతీ కార్యదర్శులు విధులు నిర్వహించగా, తాజా గా ఇందిరమ్మ సర్వేలోనూ పాల్గొంటున్నారు. ఈ క్రమంలో అదనపు పనులతో సొంత పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏటా డిసెంబర్ నెలాఖరు వరకు సుమారు 50 శాతం పన్నులు వసూలయ్యేవి. గ్రామపంచాయతీలకు ఇంటి ప న్ను, నీటి పన్నుతో పాటు తైబజార్, షాపింగ్ కాంప్లెక్స్‌ల అద్దెలతో ఆదాయం సమకూరుతుంది. వీటితో పాటు ఇంటి అనుమతుల రూపంలో కూడా ఆ దాయం వస్తుంది. ప్రస్తుతం పంచాయతీల్లో అన్ని ర కాల అనుమతులు ఆన్‌లైన్ విధానంలో ఇస్తున్నారు.
వసూళ్లకు ప్రణాళిక సిద్ధం చేశాం
జిల్లాలో పన్నుల వసూళ్లపై ప్రత్యేకదృష్టి సారిస్తాం. పంచాయతీలవారీగా ప్రణాళిక సిద్ధం చేశాం. ఇప్పటికే రైతులకు పత్తి పంట చేతికి వచ్చింది. వచ్చే నె లలో లక్ష్యం చేరేందుకు చర్యలు తీసుకుంటాం.
– భిక్షపతిగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి
Comments
Please login to add a commentAdd a comment