గుర్తించిన పనులకే ప్రాధాన్యం
● ‘ఉపాధి’లో ఆరు రకాల పనులు ● ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ● మార్చికి పూర్తయ్యేలా కార్యాచరణ ● గ్రామసభల్లో పలు పనుల గుర్తింపు
కెరమెరి: 2025–26 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి.. ఈ ఆర్థిక సంవత్సరం ఉపాధిహామీ పథకంలో భాగంగా గుర్తించిన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పనులను వేగవంతం చేసింది. గత అక్టోబర్ 2 నుంచి గ్రామసభల్లో ఆమోదించిన పనులు వచ్చే ఏడాది మార్చి 31నాటికి పూర్తి చేయాలని సూచించింది. మండలం యూనిట్‌గా ఈ పనులు సకాలంలో పూర్తి చేయాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం సూచించిన ఆరు రకాల పనులను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 123కు పైగా పనులు గుర్తించారు. మహిళలకే అధిక భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు. గిరిజన జిల్లా కావడంతో ఎస్సీ, ఎస్టీ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
పనులు ఇలా..
మహిళాశక్తికి భరోసా: ఉపాధి కల్పించేందుకు మహిళా సంఘాల సభ్యులను ఉపాధిహామీ పథకంలో భాగస్వాములను చేస్తున్నారు. వారిని స్వయం ఉపాధి వైపు మళ్లించేలా రుణాలిచ్చి ఆవులు, మేకల పెంపకం చేపట్టేలా చూస్తున్నారు. పశువుల షెడ్లు, వర్మి కంపోస్టు, మొక్కల పెంపకం, బీడు భూముల అభివృద్ధి తదితర పనులు చేస్తున్నారు.
పొలం బాట: గ్రామాల్లో పంట ఉత్పత్తులను ఇంటికి చేర్చడానికి ఈసారి మట్టి రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో ఉపాధిహామీ పథకంలో సుమారు 100 కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించారు.
ఫల వనాలు: ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో పండ్ల తోటల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. వారికి రాయితీపై బిందు సేద్యం, తుంపర్ల పరికరాలు ఇచ్చేందుకు చొరవ చూపుతున్నారు. ఈత, తాటి వనాలు పెంచుతున్నారు. జిల్లాలో ఎంపికై న నర్సరీల్లో ఈ పనులు చేపట్టనున్నారు.
జలనిధి: జల సంరక్షణలో ప్రజలను భాగస్వాముల ను చేయడం, ఇంటింటా ఇంకుడుగుంతలు, పారంఫాండ్లు, ఇంటికప్పు భాగంలో కురిసిన నీటిని భూ గర్భంలోకి ఇంకించడం, చేతిపంపుల వద్ద ఇంకుడుగుంతలు, కందకాలు తవ్వడం, నాడెపు కంపోస్టు నిర్మాణం, చెక్‌డ్యాం నిర్మించేలా చర్యలు తీసుకోవడం లాంటి పనులు ప్రారంభించారు. జిల్లాలో సుమారు 100 రకాల పనులు చేపట్టనున్నారు.
గ్రామీణ పారిశుధ్యం: గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక్కో మండలంలో కనీసం 10 చొప్పున ఇంకుడుగుంతలు ని ర్మంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటికే పలు మండలాల్లో ఇంకుడుగుంతల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామపంచాయతీల వారీగా పనులు చేపట్టాలని మండలస్థాయి ఉపాధిహామీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మౌలిక సదుపాయాలు: గ్రామాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో బాలికలు, బాలురకు వేర్వేరుగా మ రుగుదొడ్లు నిర్మించడం, మండలానికి 10 చొప్పున సిమెంట్ రహదారులు, అంగన్‌వాడీ భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. వీటిని మండలానికి 10 చొప్పున నిర్మించనున్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో గుర్తించిన పనులు ప్రారంభమయ్యాయి.
సకాలంలో పనులు పూర్తి చేస్తాం
జిల్లాలో గ్రామసభల్లో గుర్తించిన పనులు సకాలంలో పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చే శాం. నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తి చే స్తాం. అడిగిన ప్రతీ ఒక్కరికి పని కల్పించడానికి చ ర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఇప్పటికే గ్రామసభలు ముగియగా పనులు ప్రారంభమయ్యాయి.
– ఆర్ దత్తారాం, డీఆర్డీవో
Comments
Please login to add a commentAdd a comment