అర్హులందరికీ రుణమాఫీ చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ రుణమాఫీ అమలు చేయాలని టీఏజీఎస్(తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీ జిల్లాలో అమలు కాలేదన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవసాయశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వట్టివాగు గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళా రైతు పేరును వ్యవసాయ అధికారులు రికార్డుల్లో తప్పుగా నమోదు చేయడంతో రుణమాఫీ కాలేదని తెలిపారు. అలాగే కౌటగూడ గ్రామానికి చెందిన ఆత్రం బాపూరావుకు రూ.3,20,000 రుణం ఉండగా, రూ.1,20,00 చెల్లించినా మిగితా రూ.రెండు లక్షలు మాఫీ కాకపోవడం బాధాకరమన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న సీతక్క రైతులను ఆదుకోవాలని కోరారు. జనవరి 31లోగా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌లో డీఆర్‌డీవో దత్తారాంకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మాలశ్రీ, శ్రీనివాస్, గణపతి, దినకర్, సాయికృష్ణ, శ్రావణి, పురుషోత్తం, హన్మంతు, ఆనంద్‌కుమార్, అనిత, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment