పట్టుబడిన గంజాయి, నిందితులను అరెస్ట్ చూపిస్తున్న అధికారులు
గన్నవరం:అక్రమంగా నాసిక్‌కు తరలిస్తున్న సుమారు 160 కిలోల గంజాయిని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సెబ్ అదనపు ఎస్పీ ఆర్. శ్రీహరిబాబు తెలిపారు. స్థానిక సెబ్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు. సెబ్ కమిషనర్ ఎం. రవిప్రకాష్, సెబ్ ఎస్పీ కెఎం. మహేశ్వరరాజు ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీ రాత్రి పొట్టిపాడు టోల్‌గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. సోదాల్లో భాగంగా ఓ కారులో గంజాయి ప్యాకెట్లు గుర్తించినట్లు తెలిపారు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన షేక్ షేరుసాదిక్, మనోజ్ అమృదాస్ కంబాలేను అదుపులోకి తీసుకుని ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అనకాపల్లిలో ఓ వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి నాసిక్‌కు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. గంజాయి తరలింపునకు వినియోగించిన కారును సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అరెస్ట్ అయిన ఇద్దరిని కోర్టులో హాజరుపర్చామన్నారు.
కంచికచర్ల :గంజాయి విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుని జైలుకు పంపుతామని ఎస్‌ఐ పి.సత్య వెంకట సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తుండగా బుధవారం అరెస్ట్ చేశారు. కంచికచర్ల జుజ్జూరు రోడ్డులో కంచికచర్లకు చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం వచ్చిందని తెలిపారు. వారిపై దాడి చేసి కేజీన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment