పంట నష్టం అంచనాలు పూర్తి | - | Sakshi
Sakshi News home page

పంట నష్టం అంచనాలు పూర్తి

Published Sat, Sep 21 2024 3:10 AM | Last Updated on Sat, Sep 21 2024 3:10 AM

పంట నష్టం అంచనాలు పూర్తి

వరదలు, వర్షాలతో

ఉద్యాన పంటలకు అపార నష్టం

లెక్కతేలిన పంట నష్టం వివరాలు

కంకిపాడు మండలంలో 123.20 హెక్టార్లలో పంటలకు దెబ్బ

కంకిపాడు: ఉద్యాన రైతులకు ప్రకృతి కోలుకోలేని గాయం చేసింది. కోటి ఆశలతో సాగు చేపట్టిన రైతులను నట్టేట ముంచింది. వరద, భారీ వర్షాల రూపంలో పెట్టుబడులను ఊడ్చేసింది. లక్షలాది రూపాయలు పెట్టుబడులు వరదపాలు కావటంతో ఉద్యాన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

ఇటీవల కృష్ణా నది ఏటిపాయకు వరదనీరు భారీగా పోటెత్తింది. మండలంలోని మద్దూరు, కాసరనేనివారిపాలెం గ్రామాల వెంబడి ఏటిపాయకు గతంలో ఎన్నడూ లేని విధంగా 11.43 లక్షల క్యూసెక్కుల వరదనీరు రావటంతో కరకట్ట అంచులు తాకుతూ వరదనీరు ప్రవహించింది. సుమారు ఐదు రోజులు పైగా వరదనీరు పంట పొలాలను ముంచెత్తుతూ ప్రవహించింది. వ్యవసాయ, ఉద్యాన పంటలు నీటి ముంపు బారిన పడి కుళ్లిపోయాయి. వ్యవసాయ శాఖ పరిధిలోని 6,428 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.

ఉద్యాన పంటలకు ఎక్కువ నష్టం

వరద ముంపు, భారీ వర్షాలతో ఉద్యాన పంటలు నీట మునిగాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో సాగులో ఉన్న పసుపు, అరటి, కూరగాయలు, తమలపాకు, పువ్వులు, బొప్పాయి, కంద పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రతి పంటకూ ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టారు. కంద పంట మరో నెల, రెండు నెలల్లో చేతికి అందుతుంది. తమలపాకు, కూరగా యలు, పువ్వులు దిగుబడులు ఇస్తున్నాయి. మిగతా పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. యాజమాన్య చర్యలు చేపడుతున్న తరుణంలో వరద ఉపద్రవం వచ్చి పడటంతో పంటలన్నీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయని, పెట్టుబడులు మొత్తం కోల్పోవాల్సి వచ్చిందని వరద ముంపు ప్రాంత రైతులు బావురుమంటున్నారు.

వరదలు, భారీ వర్షాలతో మండలంలో 123.20 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అంచనా వేసింది. ఈ మేరకు నష్టం అంచనాలను ఉన్నతాధికారులకు నివేదించారు. అరటి 25.67 హెక్టార్లు, కూరగాయలు 11.55 హెక్టార్లు, తమలపాకు 21 హెక్టార్లు, పూల తోటలు 4.83 హెక్టార్లు, బొప్పాయి 1.04 హెక్టార్లు, పసుపు 48.39 హెక్టార్లు, కంద 10.72 హెక్టార్లలో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నష్టం వాటిల్లినట్లు నమోదు చేశారు. 227 మంది రైతులు పంట నష్టపోగా రూ.35.17 లక్షలు ఇన్‌పుట్‌ సబ్సిడీగా అందాల్సి ఉందని నివేదికలో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement