భళా.. ఆత్మ రక్షణ కళ
ఆత్మ రక్షణ అనగానే.. కరాటే, కుంగ్‌ఫూ, తైక్వాండో వంటి క్రీడలు మనకు గుర్తొస్తాయి. కానీ ఇవే కాదు. మన భారతీయ చరిత్రలో అనేక రకాల యుద్ధ కళలు ఉండేవి. రాజుల కాలంలో నాటి యువత విరివిగా అభ్యసించిన ఆ ప్రాచీన సంప్రదాయ యుద్ధ కళలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వీటికి ప్రాణం పోసి.. పూర్వ వైభవం తెచ్చేవారు నేటి సమాజంలో కరవవుతున్నారు. అయితే విన్నకోట గ్రామం ఆ విద్యలకు ఊపిరి పోస్తోంది. మాజీ సర్పంచ్ యల్లంకోట నరసింహారావు(గాంధీ) గురువుగా ఉంటూ గ్రామంలో వందలాది మందిని యుద్ధ కళలలో నిష్ణాతులను చేస్తున్నారు.
● వృద్ధాప్యంలోనూ వందలాది మందికి తర్ఫీదునిస్తున్న గాంధీ ● ఇప్పటికి 1200 మందికి శిక్షణ ● రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు ● ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత మందికి నేర్పుతానంటున్న గురువు
గుడ్లవల్లేరు: ఆపద సమయంలో చేతికర్ర చేతిలో ఉంటే.. ఐదారుగురు తోడున్నట్టే. అదే కత్తి తిప్పడం తెలిసిన వ్యక్తి చేతిలో చురకత్తి ఉంటే ఇక ప్రత్యర్థులు పరారే. అలాంటి అద్భుత కళలకు జీవం పోస్తున్నారు విన్నకోట మాజీ సర్పంచ్ యల్లంకోట నరసింహారావు(గాంధీ). 80 ఏళ్ల వయసులో కూడా కర్రసాము, కత్తిసాము, సాము గారడీ విద్యల్లో అత్యున్నత నైపుణ్యాలను చూపుతూ ఈ కళలు కనుమరుగవ్వకుండా శిష్యుల్ని తయారు చేస్తున్నారు. జిల్లాలో 1,200 మందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. కేవలం కర్రసాము, కత్తిసాము మాత్రమే కాక, గొడ్డలి కట్టుడు, సెడ్డీల వరుస, పట్టా కత్తి వేటుకు తప్పుకొనుట, చాకులతో పోరాటం, కర్ర తిప్పుడు, ట్యూబ్ లైట్లతో సాధన, కర్రసాధన వంటి అంశాల్లో శిక్షణ కొనసాగిస్తున్నారు.
65 ఏళ్లుగా శిక్షణ..
గుడ్లవల్లేరు మండల పరిధిలోని పురిటిపాడు, చింతలగుంట, విన్నకోట, శేరీ దగ్గుమిల్లి, చంద్రాల, పెడన మండలం వత్తర్లపల్లి, బంటుమిల్లి మండలం మల్లేశ్వరం, కట్లపల్లి, పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ, బందరు మండలం హుస్సేన్‌పాలెం, పాత రామన్నపేట, ఈడేపల్లి ప్రాంతాలలో ఈయన శిష్యులు ఉన్నారు. 65 ఏళ్లుగా ఈ కళలకు ఆయనతో శిష్యులు ప్రాణం పోస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, దువ్వ, వరిగేడు, గుంటూరు, కొల్లూరు, విజయవాడ, నాగాయలంక, బందరు తదితర ప్రాంతాలలో సంబరాలకు, రాజకీయ ఊరేగింపులకు ప్రదర్శనలు ఇచ్చారు.
ఆలయానికి చేయూత..
గాంధీ శిష్య బృందం గ్రామస్తుల సహకారంతో స్థానికంగా రామాలయాన్ని నిర్మించింది. ఈ బృందం ప్రదర్శనలు ఇవ్వగా వచ్చిన పైకాన్ని రామాలయ నిర్మాణానికి కేటాయించింది.
ప్రాచీన యుద్ధ విద్యకు కొత్త జీవం
కళ్లు తిప్పుకోనివ్వని కళ..
ప్రాచీన యుద్ధ కళలో పట్టాకత్తి సాము ఒకటి. ఈ విద్యను ప్రదర్శించేటపుడు గురువు గాంధీ చుట్టూ నలుగురు వ్యక్తులను పడుకోబెడతారు. డప్పుల వాయిద్యాల శబ్దాలకు లయబద్ధంగా పట్టాకత్తితో చిందులు వేస్తూ, గాలిలో పల్టీలు కొడుతూ.. ఒక వ్యక్తి మెడపై బీరకాయ, మరో వ్యక్తి ఉదరంపై దోసకాయ, మూడో వ్యక్తి ఉదరంపై కొబ్బరికాయ, నాల్గో వ్యక్తి ఉదరంపై దోసకాయను గురువు గాంధీ నరుకుతారు. ఈ విద్యను ప్రదర్శించే వ్యక్తి మానసిక స్థైర్యంతో విద్యపై దృష్టిని లఘ్నం చేయకపోతే వెంట్రుక వాసిలో ప్రాణాపాయం జరిగే అవకాశాలున్నాయి. ఈ విద్యను ప్రదర్శించేటపుడు ప్రేక్షకులు ఎక్కడ కనురెప్ప మూస్తే ఏది చూడలేకపోతామేమోనని గాంధీ విన్యాసాలపైనే దృష్టి సారిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment