దుర్గమ్మకు జ్యోతుల శోభ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దారులు అన్నీ దుర్గమ్మ సన్నిధికే చేరాయి.. జ్యోతి కాంతులు జగజ్జననికి నీరాజనాలు పట్టాయి. భక్తుల శరణుఘోషతో ఇంద్రకీలాద్రి పరిసరాలు పులకించాయి. కళాకారుల విన్యాసాలు అమ్మకు కళాజ్యోతులర్పించాయి. కనకదుర్గమ్మకు శనివారం నిర్వహించిన జ్యోతుల ఉత్సవం అంగరంగ వైభవంగా సాగింది. మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భవానీలు, భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జ్యోతులను సమర్పించారు. సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి ఇంద్రకీలాద్రి వరకు నిర్వహించిన జ్యోతుల ఉత్సవంలో నగరానికి చెందిన భవానీలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు గ్రామాలకు చెందిన భవానీలు విశేషంగా తరలివచ్చి అమ్మవారికి జ్యోతులతో మొక్కులు చెల్లించుకున్నారు.
ఉత్సవ మూర్తులకు పూజలు
శివరామకృష్ణ క్షేత్రంలోని శ్రీ గంగ, పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు దుర్గగుడి ఈఓ కె.ఎస్.రామ రావు, ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సప్తవర్ణ పుష్పాలతో దేదీప్యమానంగా అలంకరించిన ప్రత్యేక వాహనంపై ఉత్సవ మూర్తులు అధిష్టించగా, పూజాది కార్యక్రమాల నిర్వహించిన అనంతరం ఊరేగింపును ప్రారంభించారు. వంద లాది మంది భవానీలు, భవానీ భక్తులు అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఇంద్రకీలాద్రికి పయనమయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు జ్యోతులతో ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానాచార్య శివప్రసాద్‌శర్మ, ఆలయ గురు భవానీ నాగరాజు, వైదిక కమిటీ సభ్యులు రంగావజ్జుల శ్రీనివాస శాస్త్రి, ఈఈ వైకుంఠరావు, కోటేశ్వరరావు, దేవస్థానం ఇంజినీరింగ్, ఫెస్టివల్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
జ్యోతుల ఉత్సవంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కొమ్ము బూరలు, డప్పు నృత్యాలు, చిన్నారుల కోలాట నృత్యాలు, పలువురు కూచిపూడి, భరత నాట్య కళాకారులు తమ నృత్యాలను ప్రదర్శించారు. జ్యోతులతో పాటు ఆయా బృందాలు ముందుకు సాగగా, జ్యోతులు మార్గంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఊరేగింపులో దేవస్థాన ప్రచార రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అంగరంగ వైభవంగా జ్యోతుల ఉత్సవం భారీగా తరలివచ్చి పాల్గొన్న భవానీలు, భక్తులు
Comments
Please login to add a commentAdd a comment