No Headline
గుడ్లవల్లేరు: వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తుంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సబ్సిడీ వ్యవసాయ యంత్ర పరికరాలు రైతులకు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. ఖరీఫ్ వెళ్లి రబీ వచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రైతులకు ఎదురుచూపులే మిగిలాయి. యంత్ర పరికరాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వ్యవసాయ కార్యాలయాలకు రైతులు వెళ్తే ప్రస్తుతం ఆ అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. గతంలో జిల్లాలోని ఏడీఏలు, ఏఓల సహకారంతో ఆన్‌లైన్ ద్వారా పరికరాల కోసం దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉండేది. వ్యవసాయ యాంత్రీకరణ కింద పరికరాలకు కోట్లాది రూపాయలతో వివిధ పథకాల కింద గతంలో వచ్చేవి. వ్యవసాయ శాఖ ట్రాక్టర్లకు అనుబంధమైన డిస్క్ ప్లడ్లర్, లెవలర్, క్లౌవ్‌లు, స్ప్రేయర్లు, రోటోవీటర్లు, పవర్ టిల్లర్లు, మినీ ట్రాక్టర్లు, కోతమిషన్లు వంటి పరి కరాలు రైతులకు సబ్సిడీపై అందేవి. ఖరీఫ్‌లో ఇవ్వాల్సిన యంత్ర పరికరాలను కనీసం రబీలో అయినా అందజేసి ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రైతులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే వీలేది
జిల్లాలో 4,12,500 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. వరి, మొక్కజొన్న, వేరుశనగ, పెసర, మినుము వంటి సాధారణ పంటలు, చెరకు, అరటి, కంద వంటి వాణిజ్య, ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను జిల్లా రైతులు దరఖాస్తు చేసుకుని ఖరీఫ్ సీజన్‌కే పొందాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం, ఆర్‌కేవీవై, ఫామ్ మెకనైజేషన్, స్మేమ్ తదితర పథకాల కింద సబ్సిడీ పరికరాల్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలి. హ్యాండ్ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, సీడ్ డ్రిల్స్, మల్టీ క్రాప్ ప్లాంటర్స్, నూర్చే యంత్రం, స్ప్రింకర్లు, పంపు సెట్ పరికరాలు, నీరు తోడే పైపులు, రోటోవీటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, ట్రాక్టర్‌తో నడిచే పరికరాలు, స్ప్రేయర్లు, ఇంజిన్లు, వరికోత యంత్రాలు, పవర్ టిల్లర్, కలుపు యంత్రం వంటి వివిధ పరికరాలపై సబ్సిడీపై దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.
చిన్న, సన్నకారు రైతులకే ఈ పథకం
చిన్న, సన్నకారు రైతులకే ఆ శాఖ ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ, చిన్న రైతులు ఐదుగురు చొప్పున గ్రూపులుగా ఏర్పడితే వారికి యంత్రాలు ఇవ్వాలి. ఈ గ్రూపుల వారు కస్ట్‌మర్ హైరింగ్ సెంటర్‌లో మొక్క జొన్న సంబంధ పరికరాల్ని అందజేయాలి. ఈ స్టేషన్ కింద పరికాలపై రాయితీలు పొందవచ్చు. రాష్ట్రీయ కృషీ వికాస్ యోజన(ఆర్‌కేవీవై) కింద కోట్లాది రూపాయలతో పాటు మిగులు నిధులు, కేంద్ర నిధులు జిల్లాకు కేటాయించాల్సి ఉంది. ఆ నిధులను జిల్లా రైతులకు కల్పించలేదు. ఈ గ్రూపులకు లక్షల రూపాయల వరకు సబ్సిడీ వర్తిస్తుంది.
జాతీయ ఆహార భద్రత ఎక్కడ?
జాతీయ ఆహార భద్రత మిషను పథకం కింద జిల్లాకు నిధులు కేటాయించాలి. గతంలో మిగులు నిధులు కోట్లాది రూపాయలు కూడా జిల్లాకే ఖర్చు చేశారు. ఆయిల్ ఇంజిన్లు, వాటర్ పైపులు వంటివి దీని కింద పొందొచ్చు. ఈ పథకాల కింద వ్యవసాయ పరికరాలను పొందేందుకు ఆసక్తి గల రైతులు మీ – సేవ కేంద్రాలకు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తే ఆ పథకాలకు నిధులు కేటాయించలేదని చెప్పటంతో రైతుల ఆశలు ఆవిరై ఇంటి ముఖం పడుతున్నారు. ఈ ఏడాది సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు నిధులు మంజూరు కాకపోవటంతో ఈ సారికి రైతులకు ఇవ్వలేమని జేడీఏ ఎన్.పద్మావతి వివరణ ఇచ్చారు.
రైతులకు అందని సబ్సిడీ యంత్ర పరికరాలు పత్తాలేని ప్రభుత్వ రాయితీ పథకాలు రబీ వచ్చినా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
నార్మల్ స్టేట్ ప్లాన్‌కు నిధులేవి?
జిల్లాలో రైతులకు వ్యవసాయ పనిముట్లను అందజేసేందుకు నార్మల్ స్టేట్ ప్లాన్ పథకం కింద కోట్లాది రూపాయల నిధులను జిల్లాకు ప్రభుత్వం కేటాయించాలి. ఈ పథకంలో ఓసీ, బీసీ వర్గాల రైతులకు 40 శాతం సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. రొటోవీటర్లు, పవర్ టిల్లర్లు, కల్టివేటర్లు, ప్లడ్లర్లు వంటి పరికరాలు ఈ పథకంలో అందజేయాలి. కానీ ఆ పథకం పత్తా లేకుండా పోయింది. జిల్లాకు సబ్ మిషన్ ఆఫ్ అగ్రికల్చర్ యాంత్రీకరణ పథకం కేంద్ర ప్రభుత్వం జిల్లాకు నిధులను ఏటా కేటాయిస్తుంది. ఈ పథకంలో చిన్న ట్రాక్టర్లు (20హెచ్‌పీ), వరినాటే యంత్రాలు, కల్టివేటర్లు, రీపర్లు పొందవచ్చు. ఈ యంత్ర పరికరాలు కూడా ఈ సారి రైతులకు అందజేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment