ఏకపక్షం.. పచ్చపాతం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో శుక్రవారం సాగునీటి సంఘాల ప్రాదేశిక నియోజకవర్గాలు, సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 2,317 ప్రాదేశిక నియోజకవర్గాలు, 209 సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా నిర్వహించింది. వైఎస్సార్ సీపీ ఎన్నికలను బహిష్కరించటంతో కూటమి నాయకులు ఇష్టానుసారంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. మండలానికి ఒక బాధ్యుడిని ఏర్పాటు చేసి అతని ద్వారా ఆయా ప్రాదేశిక నియోజకవర్గాలు, నీటి సంఘాలకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ముందుగానే నిర్ణయించి వారినే ఎన్నుకునేలా ఓటర్లకు సూచించారు. వీటితో పాటు సహకార సంఘాల ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో ఆ ఒడంబడికలు, ఒప్పందాలతో ఈ ఎన్నికలు కూటమి నాయకులు నిర్వహించారు. కొన్ని చోట్ల వివాదాస్పద సంఘటనలు కూడా జరిగాయి.
నియోజకవర్గాల వారీగా..
● మచిలీపట్నం నియోజకవర్గలోని బందరు మండలంలో 13 ప్రాదేశిక నియోజకవర్గాలకు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. కూటమిలో జనసేన పార్టీకి పోతిరెడ్డిపాలెం, చిన్నాపురం ప్రాదేశిక నియోజకవర్గాలను ఒడంబడికలో భాగంగా అప్పజెప్పినట్లు సమాచారం.
● పెడన నియోజకవర్గంలోని పెడన మండలం నందిగామ ప్రాదేశిక నియోజకవర్గం 111, సబ్‌డివిజన్ 3లో ఎన్నికలు జరగ్గా ఓడిపోయిన అభ్యర్థి పామర్తి వెంకటేశ్వరరావు నామినేషన్ పత్రాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎన్నికల అధికారి జి.మధు ఎడమచేతికి గాయాలయ్యాయి. వెంకటేశ్వరరావుకు ఎడమచేతికి గాయం కావటంతో సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో నందిగామ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జరిగిన 12 ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు నిలిపివేశారు. బంటుమిల్లి మండలం పెందుర్రు గ్రామంలో జరిగిన 128 ప్రాదేశిక నియోజకవర్గంలో జనసేన పార్టీకి చెందిన నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. నామినేషన్ పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. గూడూరు, కృత్తివెన్ను మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
● గన్నవరం నియోజకవర్గంలో నీటి సంఘాల ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి. బాపులపాడు మండలంలోని మల్లవల్లి, రేమల్లె ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల్లో టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి పోటీ చేయడానికి ప్రయత్నించారు. జనసేన పార్టీకి కొన్ని ప్రాంతాల్లో పట్టులేదని వారిని టీడీపీ నాయకులు విస్మరించారు.
● గుడివాడ నియోజకవర్గంలోని గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో నీటి సంఘాలు, ప్రాదేశిక నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఏకపక్షంగా తమ పార్టీకి చెందిన అభ్యర్థులను ఎన్నుకున్నారు.
● అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీకి చెందిన శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ చెప్పిన వ్యక్తులనే నీటి సంఘాలు, ప్రాదేశిక నియోజకవర్గాలకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చల్లపల్లి, నాగాయలంక మండలాల్లో టీడీపీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆ నాయకులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
● పెనమలూరు నియోజకవర్గంలో పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లో మండలానికి ఒకర్ని పార్టీ తరుపున బాధ్యతగా అప్పగించి శాసనసభ్యులు సూచించిన పేర్లు ఉన్న వ్యక్తులనే అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నుకునేలా అధికారులతో కలిసి ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. రానున్న సహకార సంఘాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒడంబడికలు, ఒప్పందాలతో ఈ ఎన్నికల్లో మిగిలిన వారిని పక్కకు తొల గించేలా టీడీపీ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
● పామర్రు నియోజకవర్గంలోని అన్ని ప్రాదేశిక నియోజకవర్గాలు, నీటి సంఘాల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ వారికే పట్టం కట్టారు. పమిడిముక్కల, పామర్రు, తోట్లవల్లూరు, మొవ్వ, పెదపారుపూడి మండలాల్లో కూటమిలోని మిగిలిన పార్టీ నాయకులకు అవకాశం కల్పించకుండా టీడీపీకి చెందిన వారికే అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు కట్టబెట్టారు. పామర్రు మండలంలోని ఒక్క కొమరవోలు ప్రాదేశిక నియోజకవర్గంలోనే జనసేన పార్టీకి చెందిన తాడిశెట్టి మధుకు ఉపాధ్యక్ష పదవి ఇచ్చి సరిపెట్టారు.
కూటమికి అనుకూలంగా సాగునీటి సంఘాల ఎన్నికలు సహకార సంఘాల ఎన్నికల ఒడంబడికలతో నీటి సంఘాల ఎన్నికలు బాపులపాడు మండలం రేమల్లె, మల్లవల్లిలో రెండు వర్గాలుగా పోటీ నందిగామ, పెందుర్రులో నామినేషన్ల చించివేత, ఎన్నికల అధికారిపై దాడి
Comments
Please login to add a commentAdd a comment