సూర్యప్రభపై శ్రీ వేంకటేశ్వరుడి ఊరేగింపు
గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రులో కొలువైన శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివార్లను శనివారం సూర్యప్రభ వాహనంపై కనులపండువగా ఊరేగించారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్) అధినేత, దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణ నడుమ ఈ వేడుక వైభవంగా జరిగింది. దేవదేవుడి దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా విచ్చేశారు. వేద పండితులు ధ్వజారోహణ ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు గరుడ ప్రసాదం పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం నిర్వాహకులు పురిటిపాటి వీరారెడ్డి, విజయలక్ష్మి దంపతులు, కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతులు, పి.ప్రసన్న, పి.వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఫారెస్ట్ అధికారుల
అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
ఇబ్రహీంపట్నం: ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఫారెస్ట్ అధికారుల అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యవర్గ ఎన్నికలు విజయవాడ గ్రీన్ హౌస్ ఫారెస్ట్ కార్యాలయంలో శనివారం జరిగాయి. అధ్యక్షుడిగా బి.లెనిన్ కుమార్, ఉపాధ్యక్షులుగా వి.రత్నకుమారి, ప్రధాన కార్యదర్శి పి.పోతురాజు, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శిగా ఎ.రామకృష్ణ, కోశాఽధి కారిగా జి.దుర్గారావును ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె.శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శశిభూషణ్ యాదవ్, రాజమండ్రి సర్కిల్ జోనల్ కార్యదర్శి చిన్న బిక్షం వ్యవహరించారు. నూతన సభ్యులను కార్యవర్గ సభ్యులు, అధికారులు అభినందించారు.
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో హర్షిత్‌సాయి ప్రతిభ
మచిలీపట్నంటౌన్: హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మచిలీపట్నానికి చెందిన కె.హర్షిత్‌సాయి ప్రతిభ చాటాడు. సబ్ జూనియర్స్ విభాగంలో జరిగిన రెండు పోటీల్లో పాల్గొన్న హర్షిత్‌సాయి 315 కేజీల బరువు ఎత్తి ప్రధమ, ద్వితీయ స్ధానాలను కై వసం చేసుకున్నాడు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేతుల మీదుగా బంగారు, వెండి పతకాలు, ప్రశంసా పత్రాలను అందుకున్నాడు. జనవరి 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ ఛత్తీగఢ్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు తాను హాజరవుతున్నానని హర్షిత్‌సాయి తెలిపారు. అతడిని నగరానికి చెందిన క్రీడాకారులు, ప్రముఖులు అభినందించారు.
దుర్గమ్మకు
రూ.2 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు బెంగళూరుకు చెందిన భక్తులు శనివారం రూ.2 లక్షల విరాళం సమర్పించారు. బెంగళూరుకు చెందిన వెలుగురి కుమార్ దంపతులు అమ్మ వారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ ఈఓ కె.ఎస్.రామ రావును కలిసి విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment