సైబర్ మాయగాళ్ల వలలో సీనియర్ సిటిజన్
హనుమాన్‌జంక్షన్ రూరల్: సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకుంటూ అమాయకుల సొమ్మును దోచుకుంటున్నారు. సామాన్యులకు పోలీసు కేసులంటే ఉండే భయాన్ని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా హనుమాన్‌జంక్షన్‌లో ఓ సీనియర్ సిటిజన్ నుంచి రూ.2,32,323ను సైబర్ నేరగాళ్లు దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక ఏలూరురోడ్డుకు చెందిన అట్లూరి బాబురావు చిన్న కుమార్తె అమెరికాలో స్థిరపడగా, మరో కుమార్తె విజయవాడలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఉంటున్న బాబురావు దంపతులను సైబర్ నేరగాళ్లు వలలో వేశారు. తొలుత ట్రాయ్ నుంచి ఫోన్ కాల్ చేస్తున్నట్లుగా అజ్ఞాత వ్యక్తి మాట్లాడుతూ ముంబయిలో ఈ ఏడాది జూన్ 2న మీ ఆధార్‌తో సిమ్‌కార్డు కొనుగోలు చేశారని, ఆ ఫోన్ నంబర్‌తో పలు నేరాలకు పాల్పడటంతో పోలీస్ కేసు నమోదు చేసినట్లు బాబురావును బెదిరించారు. దీంతో కంగుతిన్న ఆయన తేరుకునేలోపే మరో అజ్ఞాత వ్యక్తి ముంబయి సీబీఐ పోలీసు అధికారి అంటూ వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. సదరు వ్యక్తి మాటతీరు, వ్యవహారశైలి బాబురావును మరింత భయాందోళనకు గురిచేశాయి. వరుసగా మూడురోజుల పాటు ఎడతెరిపి లేకుండా ట్రాయ్, సీబీఐ అధికారులమంటూ వాట్సాప్ వీడియో కాల్స్ చేసి మానసికంగా తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురిచేశారు. నేను ఎలాంటి నేరాలకు పాల్పడలేదని, అసలు జూన్ 2న నేను ముంబయి రాలేదని, ఏపీలో ఉన్నానంటూ బాబురావు చెప్పేందుకు యత్నించగా, మీపై కేసు నమోదు కావటంతో విచారణ చేయక తప్పదన్నారు. మేం హనుమాన్‌జంక్షన్ వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీ పరువు పోతుందంటూ భయపెట్టారు. విచారణలో భాగంగా బ్యాంకు అకౌంట్ వివరాలు, బ్యాలన్స్ చెప్పాలని అడగటంతో పాటు ఆ వివరాలను వాట్సాప్‌లో పంపాలని చెప్పారు. అన్ని బ్యాంక్ అకౌంట్లలోని సొమ్మును ఒకే బ్యాంక్ ఖాతాలోకి మార్చి తమకు ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయాల్సిందిగా ఆదేశించారు. దీని కోసం డిటెక్టివ్ బ్యాంక్ ఖాతా అంటూ ‘తిలక్ రాజ్ అండ్ సన్స్’ పేరిట ఉన్న ఎస్ బ్యాంకు నంబర్ ఇచ్చారు. మీ సొమ్ము కేవలం 20 నిముషాల పాటు హోల్డ్‌లో ఉంటుందని, ఆ తర్వాత తిరిగి మీ ఖాతాకు జమవుతుందని నమ్మించారు. దీంతో బాబురావు ఈ నెల 12న సైబర్ నేరగాళ్లు చెప్పిన ఎస్ బ్యాంక్ అకౌంట్‌కు రూ.2,32,323 ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ తర్వాత ఆయన పేరిట బ్యాంకులో ఉన్న మరో రూ. 5 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ కూడా రద్దు చేసి, ఆ సొమ్ము కూడా ఆర్టీజీఎస్ చేయాలని ఒత్తిడి పెంచారు. దీనిపై ఆయన తర్జనభర్జన పడుతూ విజయవాడలో నివసిస్తున్న పెద్ద కుమార్తెకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో ఇదంతా సైబర్ నేరగాళ్ల తంతు అని బాబురావుకు కుమార్తె, అల్లుడు ధైర్యం చెప్పారు. ఎలాంటి భయాందోళన వద్దని మరింత సొమ్ము పంపవద్దని, దీనిపై తక్షణమే పోలీసు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఆయన పెదపాడు పోలీస్‌స్టేషన్‌కు శుక్రవారం వెళ్లి పోలీసులకు జరిగిన విషయమంతా చెప్పి, బ్యాంకు ఆర్టీజీఎస్ రశీదు, బ్యాంకు ఖాతా వివరాలు, వాట్సాప్ చాట్, ఫోన్ నంబర్లను ఫిర్యాదుతో పాటు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment