అందరి సహకారంతో అవార్డు
ముప్పాళ్ల సర్పంచి వీరమ్మ
గన్నవరం: అందరి సహకారంతో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు లభించినట్లు చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామ సర్పంచి కుసుమరాజు వీరమ్మ చెప్పారు. జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకున్న చందర్లపాడు మండలం ముప్పాళ్ల సర్పంచి కుసుమరాజు వీరమ్మకు శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ఆ గ్రామస్తులు స్వాగతం పలికారు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న అనంతరం ఆమె ఇండిగో విమానంలో సాయంత్రం ఇక్కడికి చేరుకున్నారు. అవార్డును అందుకోవడం సర్పంచ్‌గా బాధ్యతలను మరింతగా పెంచిందని వీరమ్మ తెలిపారు. అవార్డుతో పాటు తమ గ్రామాభివృద్ధికి రూ. కోటి నిధులను కేంద్రం గ్రామ పంచాయతీకి కేటాయించినట్లు తెలిపారు. ముప్పాళ్ల ఉపసర్పంచి నల్ల రవి, పంచాయతీ కార్యదర్శి సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
సైబర్ చోరీని అడ్డుకున్న బ్యాంక్ సిబ్బందికి సత్కారం
విజయవాడస్పోర్ట్స్: సమయ స్ఫూర్తితో వ్యవహరించి భారీ సైబర్ నేరం జరగకుండా అడ్డుకున్న ఎస్‌బీఐ ప్రజాశక్తినగర్ బ్రాంచ్ ఉద్యోగి పిచ్చయ్య, మేనేజర్ రమేశ్వర్‌ను పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తన చాంబర్‌లో శుక్రవారం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో నకిలీ పోలీసులుగా సైబర్ నేరగాళ్లు వ్యవహరిస్తూ ప్రజలను దోపీడీ చేస్తున్నారని, ఇలాంటి నేరాల నియంత్రణకు బ్యాంకర్లు సహకరించడం అభినందనీయమని కమిషనర్ అన్నారు. విజయవాడకు చెందిన ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ట్రాప్ చేశారని, తన బ్యాంకు ఖాతాలోని నగదును నేరగాళ్లకు పెద్ద మొత్తంలో పంపించడానికి ఆ వ్యక్తి బ్యాంకుకు వెళితే.. సిబ్బంది సమయస్ఫూర్తితో ఆ విషయాన్ని గుర్తించి భారీ సైబర్ నేరాన్ని అడ్డుకున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment