పట్టపగలే చోరీలు..
25.7 తులాల బంగారం, 50.5 తులాల వెండి వస్తువుల స్వాధీనం
అక్కిరెడ్డిపాలెం: పగటిపూట ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీసీపీ కె.లతామాధురి తెలిపారు. గాజువాక పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు. గాజువాకలోని సింహగిరికాలనీలో పుత్తిరెడ్డి కుసుమ కుమారి కుటుంబం నివసిస్తోంది. కుసుమ కుమారి ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఆమె భర్త ప్రైవేట్ కాంట్రాక్ట్ వర్కర్. వారు ఇంటి తాళాలను మెయిన్ డోర్ వద్ద ఉన్న షూ స్టాండ్‌లో ఉంచి విధులకు వెళ్తుంటారు. కుసుమ కుమారి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి తిరిగి వస్తుంటారు. ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఇంటి ప్రధాన తలుపు తెరిచి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బెడ్‌రూమ్‌లో బీరువా తెరిచి ఉండటం, అందులోని 20 తులాల బంగారు వస్తువులు, 25 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే ఆమె గాజువాక క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఇదే తరహా దొంగతనాలకు సంబంధించి నాలుగు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో క్రైం డీసీపీ కె.లతా మాధురి, ఏడీసీపీ మోహనరావు, ఏసీపీ లక్ష్మణరావు, సౌత్ సబ్ డివిజన్ క్రైం ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది.
సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా కేసులో ప్రధాన నిందితుడైన జగదీష్‌ను గాజువాక బీసీ రోడ్డు మసీదు సెంటర్‌లో అరెస్ట్ చేశారు. అతనిది కృష్ణా జిల్లా గుడివాడ. అతనికి సహకరించిన తణుకు నియోజకవర్గం పైడివాడలోని నాగేంద్రనగర్‌కు చెందిన ఇమ్మంది జ్యోతి శివను కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరి నుంచి 25.7 తులాల బంగారం, 50.5 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు జగదీష్‌పై ఇది వరకే పలు పీఎస్‌ల్లో కేసులు నమోదై ఉన్నాయని డీసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment