గ్రంథాలయాలపై నిర్లక్ష్యం!
భవానీపురం(విజయవాడపశ్చిమ): పెద్దల కృషి, త్యాగంతో రూపుదిద్ది మనకు అందించిన విజ్ఞాన భాండాగారాలు (గ్రంథాలయాలు) నేడు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఉదాసీనతతో వదిలేస్తే తెలుగు జాతి జ్ఞాన దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే చరిత్ర మనల్ని క్షమించదని అంటున్నారు గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కన్వీనర్, రచయిత వల్లూరి శివప్రసాద్. ఈ ఉద్యమం చేపట్టటానికి కారణాలు ఏమంటున్నారంటే.. ‘ప్రజలు చెల్లిస్తున్న కోట్లాది రూపాయల గ్రంథాలయ సెస్ ఏమవుతోంది?. అవసరమైన పుస్తకాల కొనుగోళ్లకు కాకుండా ప్రభుత్వం ఇతర అవసరాల కోసం ఆ నిధులను దారి మళ్లిస్తోందా?. గ్రంథాలయ సిబ్బంది నియామకాలు నిలిచిపోయి దశాబ్దలైంది. రిటైరైతే కొత్తవారిని నియమించక పోవడంతో గ్రంథాలయాల నిర్వహణ కష్టతరంగా మారుతున్న తరుణంలో పౌర గ్రంథాలయాలు మూతబడే దశకు చేరుకుంటున్నాయి. గ్రంథాలయాల్లో అధ్యయనానికి తగిన వసతులు లేని కారణంగా యువతకు వాటిపై ఆసక్తి సన్నగిల్లుతోంది. సొంతగా పుస్తకాలను ప్రచురించుకుంటున్న రచయితలు, ప్రచురణకర్తలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి గ్రంథాలయాలకు పూర్వవైభం తీసుకురావాలని’ విజ్ఞప్తి చేస్తున్నారు.
గ్రంథాలయ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన మహనీయులు
ప్రజల్లో సామాజిక స్పృహను పెంపొందించడం, జాతీయోద్యమానికి ఊతమివ్వడం, యువతను ఉద్యమం వైపు మళ్లించడం, ప్రజల్లో సంపూర్ణ మానవత్వ, వ్యక్తిత్వ వికాసం పెంపొందించడమే లక్ష్యంగా 20వ శతాబ్ది ఆరంభంలో గ్రంథాలయోద్యమం ఆవిర్భవించింది. గ్రంథాలయ వ్యవస్థ రూపుదిద్దుకోవడంలో ఎదురైన సమస్యల పరిష్కారానికి 1914 ఏప్రిల్ 10న విజయవాడలోని రామమోహన ధర్మ పుస్తక భాండాగారం నిర్వాహకులు అయ్యంకి వెంకట రమణయ్య ఆధ్వర్యంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం అధ్యక్షతన మహాసభ జరిగిందని వల్లూరు శివప్రసాద్ గుర్తుచేశారు. ఆ మహాసభ గ్రంథాలయాల అభివృద్ధికి లక్ష్యాలను నిర్దేశించుకుందని, అదే గ్రంథాలయ ఉద్యమానికి స్ఫూర్తిని ఇచ్చిందని పేర్కొన్నారు.
గ్రంథాలయ ఉద్యమం కీలక పాత్ర
పరాయి దేశస్తుల పాలన పీడనల నుంచి విముక్తి సాధించడానికి తెలుగువారిని చైతన్యవంతులను చేయడంలో గ్రంథాలయ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణకు దన్నుగా నిలిచింది. దేశ పురోగతికి పల్లె ప్రజల విజ్ఞానం, వికాసం, చైతన్యం ముఖ్యమన్న భావనతో నాటి గ్రంథాలయోద్యమ నాయకులు గ్రహించారు. అందులో భాగంగానే సాంఘిక దురాచారాలు, మూఢ విశ్వాసాలు, నిరక్షరాస్యత, పేదరికం, నిర్లిప్తత స్వైర విహారం చేసే గ్రామ సీమల్లో విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు నిర్వహించారు.
లైబ్రరీల సెస్ ఏమవుతోంది? వసూళ్లను ప్రభుత్వం దారి మళ్లిస్తోందా? గ్రంథాలయాలకు పుస్తకాల కొనుగోళ్లు నిల్ ఆర్థిక ఇబ్బందుల్లో రచయితలు, ప్రచురణకర్తలు గ్రంథాలయాల పునర్వికాస ఉద్యమానికి తొలి అడుగు
పుస్తక పఠనం నుంచి దారి మళ్లింది
నవతరం పుస్తక పఠనం నుంచి దారి మళ్లిందని, కేవలం సంపాదనే ముఖ్యమై మానవీయ విలువలపై అవగాహన లేకుండా పోవడం, తెలుగు భాషా సంస్కృతులపై చిన్న చూపుతో మానసిక సంస్కారం కొరవడుతోందని శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ వ్యక్తిగత స్వార్థం పెరిగి సాహిత్య పఠనం లేక జరుగుతున్న అనర్థాలు.. నూతన సాంకేతిక విజ్ఞానం సాధించిన ఫలితాల్లో భాగంగా ఆవిష్కృతమైన ఎలక్ట్రానిక్ పరికరాలు వారిని పుస్తకాలకు దూరం చేస్తున్నాయనే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదంటున్నారు. పూర్తి స్థాయా గ్రంథాన్ని మొబైల్ ఫోన్‌లోగానీ, ట్యాబ్‌లోగానీ, కంప్యూటర్ మానిటర్ తెరపైగాన అదే పనిగా చదవ లేరు. అలా చేయడం కంటికి, శరీరానికి శ్రమ. ఈ స్థితి నుంచి తెలుగు జాతిని కాపాడుకోవల్సిన బాధ్యత ప్రజలపై ఉంది.
గ్రంథాలయాలను కాపాడుకునేందుకే వేదిక
విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలను కాపాడుకోవాలనే రచయితలు, ప్రచురణకర్తలు, పుస్తక ప్రియులు, జర్నలిస్టులు, విద్యావేత్తల అభిప్రాయాల మేరకు గ్రంథాలయాల పునర్వికాస ఉద్యమ వేదిక ఆవిర్భవించింది. వేదిక కార్యాచరణలో భాగంగా ఈ నెల 14న విజయవాడలో నిర్వహించే ప్రదర్శన, సదస్సులో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం. రానున్న పెను ముప్పు నుంచి తెలుగు జాతిని పరిరక్షించుకోవడంలో ఇది తొలి అడుగుగా భావిస్తున్నాం. తెలుగునాట గ్రంథాలయాల స్థాపన, వాటి అభ్యున్నతికి తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంది.
– వల్లూరు శివప్రసాద్. గ్రంథాలయాల పునర్వికాస ఉద్యమ వేదిక కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment