నేడు నీటి సంఘాల ఎన్నికలు
చిలకలపూడి(మచిలీపట్నం): నీటి సంఘాల ఎన్నికలు శాసనసభ్యుల కనుసన్నల్లో జరగనున్నాయని తెలుస్తోంది. జిల్లాలో నీటి వినియోగదారుల సంఘాలు, ప్రాదేశిక నియోజకవర్గ సంఘాల ఎన్నికలను షెడ్యూలు ప్రకారం శనివారం నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 3,11,180 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. జిల్లాలో 2,317 ప్రాదేశిక నియోజకవర్గాలు, 209 నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి షెడ్యూలును ఈ నెల 11న కలెక్టర్ డీకే బాలాజీ విడుదల చేశారు. దాని ప్రకారం 14వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ఆయా మండలాల పరిధిలోని మండలస్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఉదయం 8గంటలకు ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లను సమావేశ పరిచి అనంతరం నీటి సంఘాల ఆవశ్యకతను వివరిస్తారు. 9.15 నుంచి 9.45 గంటల మధ్య ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులను చేతులు ఎత్తే ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. అనంతరం ప్రాదేశిక నియోజకవర్గాల్లోని సభ్యులు నీటి వినియోగదారుల సంఘాలకు సంబంధించి 9.45 నుంచి 10.15 గంటల మధ్య నామినేషన్ పత్రాలను దఖలు చేస్తారు. అనంతరం 10.30 గంటలకు నామినేషన్లను పరిశీలించి తెలుగు అక్షరమాల ప్రకారం వారి పేర్ల జాబితాను తయారుచేస్తారు. ఈ జాబితా ప్రకారం 10.30 నుంచి 12.30 గంటల మధ్య అధ్యక్ష, ఉపాధ్యక్షులను చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నుకుంటారు. ఎన్నికలకు అధికారులు, సచివాలయ సిబ్బంది పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.
వారు చెప్పిన మేరకే..
ఈ ఎన్నికల్లో ఆయా ఎమ్మెల్యేలు చెప్పిన పేర్లకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించేలా సన్నాహాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏ పార్టీకి ఏ ప్రాంతంలో ఎవరికి ఇవ్వాలో ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ఆ ప్రకారం ఆయా ప్రాదేశిక నియోజకవర్గాలు, నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు శాసనసభ్యుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment