దాచేస్తే దాగని సత్యం
వైఎస్సార్ సీపీ పాలనలోనే గణనీయమైన అభివృద్ధి
అవనిగడ్డ: అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి పనులు వైఎస్సార్ సీపీ పాలనలో అధికంగా జరిగితే.. గత టీడీపీ పాలనలో తక్కువగానే పనులు జరిగాయని చెప్పొచ్చు. అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నెలకొన్న సమస్యలపై ‘సాక్షి’ ఇటీవల కథనం ప్రచురించింది. ‘గత ఐదేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలను పట్టించుకోలేదని, ఎలాంటి అభివృద్ధి జరగలేదని’ కూటమి నాయకులు ఆరోపణలు చేశారు. వైఎస్సార్ సీపీ పాలనలో రూ.4.31 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు చొరవతో కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, కళ్లకు గంతలు తొలగించి చూస్తే ఇవన్నీ కనిపిస్తాయని వైఎస్సార్ సీపీ నేతలు ఘాటుగా స్పందించారు. వీరిద్దరు చెబుతున్న వాటిలో ఏది నిజం. గత పదేళ్లలో ఎవరి పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసుకుందాం.
రూ.4.31 కోట్లతో..
గతంలో టీడీపీ పాలనలో అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధి కోసం ఖర్చు చేసింది కేవలం రూ.76 లక్షలు మాత్రమే. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో రూ.4.31 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. రూ.3.20 కోట్లతో నూతన సామాజిక ఆరోగ్య కేంద్రం నిర్మించగా, రూ.15 లక్షలతో జగనన్న ప్రాణవాయువు(ఆక్సిజన్ కేంద్రం), రూ. 71 లక్షలు సీఎస్‌ఆర్ నిధులతో సీమాక్ సెంటర్‌లో ఆధునిక స్కానింగ్ యంత్రం, ఆధునిక జన రేటర్‌లు ఏర్పాటు, రూ.10 లక్షల వ్యయంతో ఏరియా వైద్యశాల అభివృద్ధి, రూ.15 లక్షలతో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటుతో పాటు రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించారు.
టీడీపీ హయాంలో అరకొర వైద్యులు..
వైఎస్సార్ సీపీ హయాంలో వైద్యుల భర్తీ
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నలుగురు డాక్టర్లు మాత్రమే ఉండేవారు. మత్తు డాక్టర్ లేక ప్రతి కేసుని మచిలీపట్నంకు రిఫర్ చేసేవారు. వైఎస్సార్ సీపీ హయాంలో గైనకాలజిస్ట్, అనస్తీషియా, పిడియాట్రిక్, ఆర్థ్ధోపెడిక్, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ డాక్టర్లతో పాటు ఇద్దరు జనరల్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. మందులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేవి.
వైఎస్సార్ సీపీ పాలనలో రెట్టింపు డెలివరీలు
గత టీడీపీ ఐదేళ్ల పాలనలో అవనిగడ్డ ఏరియా వైద్యశాలలో మొత్తం 463 డెలివరీలు జరగ్గా, 23,487 మంది ఇన్ పేషెంట్స్, 2,91,589 మంది అవుట్ పేషెంట్స్‌కు వైద్యసేవలు అందించారు. సీఎం జగన్ పాలనలో 822 డెలివరీలు చేశారు. టీడీపీ పాలనలో కంటే వైఎస్సార్‌సీపీ పాలనలో 359 డెలివరీలు ఎక్కువ జరిగాయి. ఈ ఐదేళ్లలో 29,545 మంది ఇన్ పేషెంట్స్, 3,43,933 అవుట్ పేషెంట్స్‌కు సేవలు అందించారు. టీడీపీ పాలనలో పాముకాటు కేసులకు సక్రమంగా వైద్యసేవలు అందక పోవడం వల్ల 11 మంది మరణించగా, వైఎస్సార్‌సీపీ పాలనలో ఒక్క పాము కాటు మరణం కూడా లేకపోవడం గమనార్హం. ఇక్కడ కోవిడ్ సెంటర్ ద్వారా 296 మంది కోవిడ్ పేషెంట్లకు వైద్యసేవలు అందించారు. నాటి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు దాతల సహాయంతో ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు కోరిక మేరకు నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కిడ్నీ డయాలసిస్ కేంద్రంను గత ఏడాది నవంబర్‌లో ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment