వాలీబాల్ ఇన్విటేషన్ టోర్నీలో ఎస్‌ఆర్‌ఎం ముందంజ
విజయవాడస్పోర్ట్స్: నాదెళ్ల బసవపూర్ణయ్య (ఎంబీపీ) ట్రస్ట్ అఖిల భారత వాలీబాల్ మహిళల ఇన్విటేషన్ టోర్నిలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ జట్టు దూకుడు ప్రదర్శిస్తోంది. వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ లీగ్ పోటీల్లో ప్రత్యర్థి జట్లపై వరుసగా గెలుస్తూ అత్యధికంగా ఎనిమిది పాయింట్లతో ముందంజలో కొనసాగుతోంది. ఆరు పాయింట్లతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆరు పాయింట్లతో జేఈపీఏఐఆర్ యూనివర్సిటీ జట్టు రెండో స్థానంలో ఉన్నాయి. తమిళనాడు క్రీడా ప్రాధికార సంస్థ(ఎస్‌ఏటీ) నాలుగు పాయింట్లు, పీకేఆర్ యూనివర్సిటీ జట్టు మూడు పాయింట్లు సాధించగా, గుజరాత్ స్పోర్ట్స్ హాస్టర్ జట్టు సున్నా పాయింట్లతో వెనుకంజలో ఉంది. శనివారం సాయంత్రానికి 12 మ్యాచ్‌లు జరిగాయి. ఆదివారం సాయంత్రం ఈ పోటీలు ముగుస్తాయని ఎంబీపీ ట్రస్ట్ చైర్మన్ నాదెళ్ల బ్రహ్మాజీ, కృష్ణాజిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి దోనేపూడి దయాకరరావు తెలిపారు. ఈ పోటీలకు చీఫ్ రిఫరీగా ఎం.డానియేల్ వ్యవహరిస్తున్నారు. ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, వీఆర్ సిద్ధార్థ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ బి.పాండురంగారావు ప్రత్యేక అతిథులుగా హాజరై రసవత్తరంగా జరుగుతున్న మ్యాచ్‌లను తిలకించారు. సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు డి.ప్రభాకరరాజు, సింగారావు, తులసీరెడ్డి, రామకృష్ణరాజులను నిర్వాహకులు దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment