19 నాటికి దీక్ష విరమణ ఏర్పాట్లు పూర్తి కావాలి
ఇంద్రకీలాద్రి(విజయవాడదపశ్చిమ): భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లు ఈ నెల 19 నాటికి పూర్తి కావాలని దుర్గగుడి ఈవో కేఎస్ రామరావు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో దీక్ష విరమణలను పురస్కరించుకుని భవానీలకు దేవస్థానం కల్పిస్తున్న సదుపాయాలను ఆలయ ఈవో కేఎస్ రామరావు, ఈఈ వైకుంఠరావు పరిశీలించారు. మహా మండపం దిగువన ఇరుముడులను సమర్పించేందుకు ఏర్పాటు చేసే కౌంటర్లు, అన్న ప్రసాద వితరణ ప్రాంగణం, హోమగుండాలు, లడ్డూ విక్రయ కౌంటర్లతో పాటు క్యూలైన్లు, తలనీలాలు సమర్పించే కేశ ఖండన శాల, స్నానఘాట్లను పరిశీలించారు. వినాయకుడి నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్లు సకాలంలో పూర్తి కావడంతో పాటు పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భవానీలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు దేవస్థానం చేస్తుందన్నారు. ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీపీ పరిశీలన..
భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్‌బాబు సోమవారం పరిశీలించారు. కెనాల్‌రోడ్డుకు చేరుకున్న సీపీ రాజశేఖర్‌బాబు, ఏడీసీపీ జి.రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు, దుర్గగుడి ఈవో రామరావు, ఈఈ కోటేశ్వరరావు, వైకుంఠరావుతో కలిసి పనులపై ఆరా తీశారు. వీఎంసీ కార్యాలయం వద్ద భవానీల హోర్డింగ్ పాయింట్లు, సీతమ్మ వారి పాదాల వద్ద కేశ ఖండన శాల, స్నానఘాట్లను పరిశీలించి ఇంజినీరింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. దీక్ష విరమణలకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భవానీలు తరలివచ్చే అవకాశం ఉందని, వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీపీ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment