రాష్ట్రపతి పర్యటనకు భద్రత కట్టుదిట్టం
విమానాశ్రయం(గన్నవరం): మంగళగిరిలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేయనుండటంతో గన్నవరం విమానాశ్రయం ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. విమానాశ్రయంతో పాటు చుట్టూ పక్కల ప్రాంతంలో భారీగా పోలీసులను మొహరించారు. ఏర్పాట్లపై సోమవారం విమానాశ్రయంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనలో భద్రతా ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఉదయం 11.30 గంటలకు ఇక్కడికి చేరుకుంటారని తెలిపారు. స్నాతకోత్సవం అనంతరం తిరిగి 4.05కు ఇక్కడికి చేరుకుని హైదరాబాద్ వెళ్తారని చెప్పారు. రాష్ట్రపతికి విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, అధికారులు స్వాగతం పలుకుతారని తెలిపారు. విమానాశ్రయంలో ఆయా శాఖల అధికారులకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, పలువురు అధికారులు పాల్గొన్నారు.
విమాన ప్రయాణికులకు అలర్ట్
గన్నవరం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళగిరి పర్యటన నేపథ్యంలో ఈ నెల 17న ట్రాఫిక్ ఆంక్షలు విధించారని, దీని దృష్ట్యా విమాన ప్రయాణికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంత్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో కోరారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా విమానాశ్రయం నుంచి మంగళగిరి వరకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వివిధ నగరాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ముందుగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలని కోరారు. ఉదయం 11 నుంచి ఒంటి గంటలోపు విమాన ప్రయాణాలు చేయాల్సిన వారు ఉదయం 10 గంటలకే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలని తెలిపారు. అదే విధంగా సాయంత్రం 4 నుంచి 6 గంటలలోపు ప్రయాణాలు చేయాల్సిన వారు సాయంత్రం 3 గంటలలోపు చేరుకోవాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా విమానాశ్రయానికి చేరుకోవడానికి విజయవాడ నుంచి కంకిపాడు, కేసరపల్లి మీదుగా సులువైన మార్గంగా తెలిపారు.
ఏర్పాట్లపై సమావేశం నిర్వహించిన కృష్ణా కలెక్టర్ బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment