ఐకానిక్ బిల్డింగ్స్ అవసరం లేదు
ముఖ్యమంత్రికి మాజీ మంత్రి వడ్డే బహిరంగ లేఖ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనా విధానంలో మార్పు రావాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో లేఖను సోమవారం మీడియాకు విడుదల చేశారు. స్వర్ణాంధ్ర –2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించి ప్రజల ముందుంచడం మంచిదే కానీ.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఐకానిక్ బిల్డింగ్స్, హైపర్ లూప్ రైళ్లు, 44 అంతస్తుల భవానాలు అవసరం లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తక్షణ ప్రజావసరాలపై దృష్టి పెట్టాలని సూచించారు. విజన్ పేరుతో అవసరం లేని పనులు చేస్తే ప్రజాధనం వృథా అవుతుందని చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం సంతోషమేనని, కానీ ఇప్పటికే హైకోర్టు పనిచేస్తున్నందున ఐకానిక్ హైకోర్టు నిర్మాణం అవసరం లేదన్నారు. ఐకానిక్ సెక్రటేరియట్, అసెంబ్లీ, కౌన్సిల్ సముదాయాలను నిర్మించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా ఇవాళ కొత్త కాదని, గతం నుంచి సాగుతోందని గుర్తుచేశారు. ప్రజలు సన్న బియ్యానికి అలవాటు పడ్డారని, రాష్ట్రంలో ఆ బియ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. పేదల భూములు లక్షల ఎకరాలు 22–ఏ జాబితాలో చేర్చడం సరికాదన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్యాలు బాగానే ఉన్నాయని, సాధ్యాసాధ్యాలు పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. స్వాత్రంత్యం వచ్చిన నాటి నుంచి గరీభీ హఠావో నినాదం ఉందని, అయినా ఇప్పటికీ పేదరికం తాండవిస్తోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment