ఉప్పు భూముల్లో మట్టి స్వాహా
కోనేరుసెంటర్: ఉప్పు భూముల్లో మట్టిని స్వాహా చేస్తున్నారు ‘తమ్ముళ్లు’. మండలంలో ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ భూముల్లోనే మట్టిని మాయం చేసిన తెలుగు తమ్ముళ్లు ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ భూముల్లోనూ మట్టిని మింగేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు తల ఊపుతున్నట్లు సమాచారం. దీంతో అంతా మా ఇష్టం కాదంటే కష్టం అన్నట్లు తెలుగు తమ్ముళ్లు మట్టిని దోచేస్తున్నారు. పెద్ద పెద్ద మిషన్లతో మట్టిని బయటికి లాగుతూ ట్రాక్టర్లలోకి వేస్తున్నారు. తద్వారా లక్షల్లో సొమ్మును మింగేస్తున్నారు. జిల్లా ప్రధాన కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న అవినీతి దందాను అడ్డుకునేందుకు సాల్ట్ అధికారులు అడుగు ముందుకు వేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
150 ఎకరాల సాల్ట్ భూములు
బందరు మండలం మంగినపూడిలో సుమారు 150 ఎకరాల సాల్ట్ భూములు ఉన్నాయి. వీటిని సమీప గ్రామ రైతులకు సంబంధిత అధికారులు ఏటా లీజుకు ఇస్తుంటారు. రైతులు వేరుశనగ, సరుగుడు తదితర పంటలను వేసుకుని వచ్చిన ఆదాయంలో లీజు సొమ్మును చెల్లిస్తుంటారు. నిన్న మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోర్టు భూములను టార్గెట్ చేసి మట్టి దిబ్బలను మాయం చేసిన తెలుగు తమ్ముళ్లు ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్‌కు చెందిన సాల్ట్ భూములపై కన్నేశారు. అక్కడి మట్టి కన్నేసిన సిరివెళ్లపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళా ప్రజాప్రతినిధి భర్త సాల్ట్ భూములకు సంబంధించిన అధికారిని మచ్చిక చేసుకున్నారు. నయానో భయానో.. మట్టిని మాయం చేసేందుకు ఒప్పుకునేలా చేశాడు. అందుకు ఆ అధికారి తల ఆడించడంతో రాత్రికి రాత్రే పెద్ద పెద్ద మిషన్లను రంగంలోకి దింపారు. ట్రాక్టర్లలోకి మట్టిని లోడ్ చేసి మంగినపూడి సమీప గ్రామాల్లోకి తరలించడం మొదలు పెట్టారు. అలా ట్రక్కును రూ. 1500 చొప్పున అమ్ముకుంటూ సాల్టు భూముల్లోని మట్టిని లాగేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు పది ఎకరాల వరకు మట్టిని లాగేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో లక్షల్లో ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసేస్తున్నారు.
అడ్డుకున్న గ్రామస్తులు
గతంలో సాల్ట్ భూములు జోలికి వెళ్లాలంటే సెంట్రల్ గవర్నమెంట్ భూములు మనకెందుకు అంటూ అందరూ భయపడేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు తమ్ముళ్లు అలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడేందుకు వెనకడుగు వేయడం లేదు. ప్రభుత్వం ఏదైనా అధికారం మాదే అనుకుంటున్నారో ఏమోగానీ అవినీతికి పాల్పడేందుకు ఎక్కడ అవకాశం వచ్చినా తగ్గేదేలే అంటున్నారు. అయినకాడికి అవినీతికి పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేస్తున్నారు. మంగినపూడి సాల్టు భూముల్లోని మట్టిని అక్రమంగా అమ్ముకుంటున్న తతంగాన్ని ఆ ఊరి గ్రామస్తులు శుక్రవారం అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సాల్టు భూములకు కాపలాగా ఉన్న ఓ అధికారి గ్రామస్తులపై విరుచుకుపడి మా ఇష్టం.. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అనడంతో గ్రామస్తులు అక్కడి నుంచి వెనుదిరిగినట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా సాక్షాత్తు మైనింగ్‌శాఖ మంత్రి ఇలాకాలో జరుగుతున్నా పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది. సాల్టు అధికారులైనా పట్టించుకుని మట్టి మాఫియాపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని మంగినపూడి గ్రామస్తులు కోరుతున్నారు.
సెంట్రల్ గవర్నమెంట్ మట్టి దిబ్బలను బద్దలు కొడుతున్న తెలుగు తమ్ముళ్లు మహిళా ప్రజాప్రతినిధి భర్తతో చేతులు కలిపిన ‘సాల్టు’ అధికారులు! తిరగబడిన గ్రామస్తులు!
Comments
Please login to add a commentAdd a comment