ఏర్పాట్ల పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లను దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఎస్. సత్యనారాయణ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తొలుత దుర్గగుడికి చేరుకున్న సత్యనారాయణకు ఆలయ ఈవో కేఎస్ రామరావు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో దర్శన ఏర్పాట్లు, మహా మండపం దిగువన ఇరుముడి సమర్పించే కౌంటర్లు, హోమగుండాలు, ప్రసాదాల కౌంటర్లను పరిశీలించారు. ఇరుముడులను సమర్పించే చోట అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసే దిశగా ఏర్పాట్లు చేసుకుని ఉండాలని ఇంజినీరింగ్ సిబ్బందికి సూచించారు. కనకదుర్గనగర్‌లో ఏర్పాటు చేసిన ప్రసాదాల కౌంటర్లు, కెనాల్ రోడ్డులోని క్యూలైన్లు, కేశ ఖండనశాలను పరిశీలించారు. ఈవో రామరావు, ఈఈ కోటేశ్వరరావు, వైకుంఠరావు పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ కృష్ణా
రీజియన్ క్రీడలు ప్రారంభం
విజయవాడస్పోర్ట్స్: పాలిటెక్నిక్ కృష్ణా రీజియన్ అంతర కళాశాలల బాలుర క్రీడా పోటీలు విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు క్రీడా జ్యోతి వెలిగించి ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. కృష్ణాజిల్లాలోని 24 కళాశాలల నుంచి 654 క్రీడాకారులు ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్, చెస్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, అథ్లెటిక్స్ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు పోటీల ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎన్.పద్మావతి, సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ సీహెచ్ మధుసూదనరావు తెలిపారు. రెండు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని, పోటీల అనంతరం విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికెట్‌లు అందజేస్తామన్నారు. ప్రారంభోత్సవంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయసారధి, రాష్ట్ర పీడీల సంఘం అధ్యక్షుడు కమల్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): విద్యార్థులకు చదువులో మెలకువలను నేర్పించి.. విద్యలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు అందరు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు పిలుపునిచ్చారు. పాఠశాల విద్య సాల్ట్ ప్రోగ్రాం ఫౌండేషనల్ లిటరసీ–న్యూమరసీ 120 రోజుల సర్టిఫికెట్ కోర్సులో భాగంగా మూడు రోజుల పాటు పాఠశాల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, ఐసీడీఎస్, సీడీపీఓలు, సూపర్‌వైజర్లకు సింగ్‌నగర్ ఎంకే బేగ్ మున్సిపల్ హైస్కూల్‌లో నాన్ రెసిడెన్షియల్ రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ శిక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ అంగన్‌వాడీ కేంద్రంలో ప్రవేశాలు పెంచాలని కోరారు. సమగ్ర శిక్ష ఏిపీసీ జి. ఉమా మహేశ్వరరావు, డైట్ లెక్చరర్ పి.లలిత్ మోహన్, ఏఎంఓ ఎస్.అశోక్ బాబు, వెన్యూ ఇన్‌చార్జ్ ఆర్.విజయ రామారావు, నార్త్‌జోన్ విద్యాశాఖాధికారి బి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
‘మిషన్ వాత్సల్య’ను
బలోపేతం చేద్దాం
పెనమలూరు: పిల్లల హక్కుల పరిరక్షణకు ‘మిషన్ వాత్సల్య’ను బలోపేతం చేసే విధంగా జిల్లా యూనిట్లు పని చేయాలని మహిళా శిశు, వయోవృద్ధుల సంక్షేమ, విభిన్న ప్రతిభావంతుల శాఖ కార్యదర్శి సూర్యకుమారి అన్నారు. కానూరులోని మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో శుక్రవారం రెండు రోజుల పాటు జరగనున్న వర్క్‌షాప్‌ను ఆమె ప్రారంభించి, ప్రసంగించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ బాలల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. 26 జిల్లాలో 180 మంది మిషన్ వాత్సల్య సిబ్బందికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో బాలల న్యాయ చట్టాల గురించి సిబ్బందికి వివరించారు. యూనిసెఫ్ ప్రతినిధి సోనీకుట్టి జార్జ్, జాయింట్ డైరెక్టర్ శిరీష, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీలక్ష్మి, నోడల్ అధికారులు, మిషన్ వాత్సల్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment