‘దీక్షా’దక్షత.. పరిపూర్ణత
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మండలం రోజుల పాటు అమ్మవారి దీక్షను స్వీకరించి ఎంతో భక్తిశ్రద్ధలతో నిత్య పూజలు నిర్వహించే భవానీలు.. అమ్మవారి దీక్షలను విరమించేందుకు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. నేటి నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్ష విరమణలకు దేవస్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. స్నానఘాట్లు, గిరి ప్రదక్షిణ మార్గంలో మంచినీటి సదుపాయం, క్యూలైన్‌లో వసతులు, 5 క్యూలైన్ల ద్వారా అమ్మవారి దర్శనం, ఇరుముడి పాయింట్లు, అమ్మవారి అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదాలు ఇలా సకల సదుపాయాలను దేవస్థానం కల్పించింది.
ఇంద్రకీలాద్రికి చేరుకునే మార్గాలివే..
రాష్ట్ర నలుమూలల నుంచి భవానీలు వివిధ మార్గాల ద్వారా విజయవాడకు చేరుకుంటారు. అత్యధికంగా భవానీలు రైళ్లు, బస్సులలో నగరానికి చేరుకుని అక్కడి నుంచి ఇంద్రకీలాద్రికి తరలివస్తారు. ఇక ప్రైవేటు వాహనాలపై వచ్చే భవానీలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించిన పోలీసు శాఖ వారిని అక్కడి నుంచి ఇంద్రకీలాద్రికి చేరుకునేలా ఏర్పాట్లు చేసింది. వైజాగ్, రాజమండ్రి వైపు నుంచి వచ్చే భవానీలు బీఆర్‌టీఎస్ రోడ్డులో తమ వాహనాలను నిలుపుకొనే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్, ఖమ్మం, భద్రాచలం వైపు నుంచి వచ్చే వాహనాలను భవానీఘాట్ వరకూ అనుమతిస్తారు.
పార్కింగ్ ప్రాంతాలు..
భవానీలు వాహనాలను నిలుపుకునేందుకు పోలీసు శాఖ ప్రత్యేకంగా స్థలాలను కేటాయించింది. రాజీవ్‌గాంధీపార్కు, పున్నమీఘాట్, భవానీఘాట్, బబ్బూరి గ్రౌండ్స్, సితారా సెంటర్ వద్ద, లోటస్, బీఆర్‌టీఎస్ రోడ్డులను కేటాయించింది.
స్నాన ఘాట్లు సిద్ధం..
భవానీలు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు నదీ తీరంలో స్నానఘాట్లను సిద్ధం చేసింది. వీటిలో కీలకమైంది సీతమ్మవారి పాదాల ఘాట్. ఇది రైల్వే స్టేషన్, బస్టాండ్‌ల నుంచి విచ్చేసే భవానీలకే కాకుండా అమ్మవారి దర్శనం తర్వాత తలనీలాలను సమర్పించేందుకు కేశఖండనశాల అందుబాటులో ఉన్న స్నానఘాట్. ఈ ఘాట్‌లో దేవస్థానం 5 వందల షవర్లు అందుబాటులో ఉంచింది. పున్నమీ ఘాట్‌లో రెండు వందల షవర్లు, భవానీ ఘాట్‌లో మరో వంద షవర్లు ఏర్పాటు చేసింది. స్నానఘాట్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు శానిటేషన్ సిబ్బంది 24 గంటలు పని చేస్తారు.
దర్శనానికి 5 క్యూలైన్లు..
అమ్మవారి దర్శనానికి విచ్చేసే భవానీల కోసం దేవస్థానం టికెట్ల విక్రయాలను నిలిపివేసింది. అమ్మవారి ఆలయంలో 5 క్యూలైన్ల ద్వారా భవానీలు అమ్మవారిని దర్శించుకోవచ్చు. ముఖ మండపం, రూ. 300, రూ.100 టికెటు క్యూలైన్లతో పాటు రెండు సర్వ దర్శనం క్యూలైన్ల ద్వారా భవానీలు ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి 3 క్యూలైన్లుగా ప్రారంభమై ఆలయ ప్రాంగణంలోకి చేరే సరికి 5 క్యూలైన్లుగా మారతాయి.
110 ఇరుముడి కౌంటర్లు
మహా మండపం దిగువన భవానీలు ఇరుముడులను సమర్పించేందుకు దేవస్థానం ప్రత్యేక స్టాండ్లు ఏర్పాటు చేసింది. మొత్తం 110 స్టాండ్లు ఏర్పాటు చేసి గురు భవానీలను మూడు షిఫ్టులుగా విధులు కేటాయించింది. భవానీల రద్దీ అధికంగా ఉండే మరిన్ని స్టాండ్లు ఏర్పాటు చేసేలా దేవస్థానం అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచింది.
అన్ని శాఖల సమన్వయంతో..
దీక్ష విరమణలకు విచ్చేసే భవానీల సేవలో పోలీసు, రెవెన్యూ, దేవదాయ శాఖకు చెందిన వందలాది మంది విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీ సు శాఖలో ఎస్పీ స్థాయి అధికారులు 10, డీఎస్పీ స్థాయి అధికారులు 49 మంది, సీఐలు 145 మంది, ఎస్‌ఐలు 325 మందితో కలిపి మొత్తం 4,600 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక శానిటేషన్‌కు 650 మంది, దేవస్థాన పరిసరాలలో 3 వందల మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందితో పాటు దుర్గగుడికి చెందిన సిబ్బంది, దేవదాయ శాఖకు చెందిన వెయ్యి మంది విధులు నిర్వర్తిస్తున్నారు.
నేటి నుంచి భవానీ దీక్ష విరమణలు ఇంద్రకీలాద్రిపై ఐదు రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ సదుపాయాలు కల్పించిన దేవస్థానం అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమైన భవానీల రాక
Comments
Please login to add a commentAdd a comment