పోలీసుల పేరుతో దారి దోపిడీ
విజయవాడస్పోర్ట్స్: ఖాకీ ప్యాంట్, వైట్ టీ షర్ట్, బ్రౌన్ కలర్ షూ ధరించి పోలీసులమని చెప్పి దారి దోపిడీకి పాల్పడిన ముఠాను విజయవాడ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దోపిడీ చేసిన నగదు మొత్తాన్ని నిందితుల నుంచి రికవరీ చేశారు. కేసు వివరాలను పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిషనర్ ఎస్.వి.రాజశేఖరరాబు వెల్లడించారు. విజయవాడలోని సీతారామపురం ప్రాంతంలో ప్రస్తుతం నివసిస్తున్న చేగు పార్థసారథి గతంలో జగ్గయ్యపేటలో ఉండేవారు. అక్కడ నుంచి విజయవాడకు చేరుకుని అనేక వ్యాపారాలు చేశాడని, జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించడానికి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడని కమిషనర్ చెప్పారు. జగ్గయ్యపేటలో నివసిస్తున్న రోజుల్లో ఓ బంగారు షాపులో గుమస్తాగా పని చేస్తున్న వ్యక్తిని గమనిస్తుండేవాడని, వ్యాపారి వద్ద భారీ మొత్తంలో నగదు తీసుకుని బంగారం కొనుగోలు నిమిత్తం నెల్లూరు, చైన్నె వెళ్తాడని గ్రహించాడని వివరించారు. సదరు వ్యాపారిని ట్రాప్ చేస్తే భారీ మొత్తంలో నగదు దోచుకోవచ్చని బీఆర్టీఎస్ రోడ్డులో నివసిస్తున్న ప్రత్తిపాటి శాంతికి పార్థసారథికి చెప్పాడన్నారు.
వించిపేటకు చెందిన పటాన్ సుభానీఖాన్, దుర్గాకాలనీకి చెందిన గుల్లూరు వంశీకృష్ణంరాజు, పాతరాజరాజేశ్వరిపేటకు చెందిన షేక్ హుజారిద్దీన్(రౌడీషీటర్)తో శాంతి, పార్థసారథి సమావేశమై నకిలీ పోలీస్ ప్లాన్‌ను సిద్ధం చేశారని తెలిపారు. బంగారం కొనేందుకు గుమస్తా ఎప్పుడూ రైలులో వెళ్తుంటాడని, అయితే ఈ నెల 11వ తేదీన రైలు మిస్ కావడంతో అద్దె కారులో బయలు దేరారు. ఈ విషయాన్ని పార్థసారథి గమనించి, సమాచారాన్ని ముఠాకు చేరవేశాడన్నారు.
ఖుద్దూస్‌నగర్ వద్ద కారు ఆపి..
ప్లాన్‌లో భాగంగా సుభానీఖాన్, వంశీకృష్ణంరాజు ఖాకీ ఫ్యాంట్, వైట్ టీ షర్ట్, బ్రౌన్ కలర్ షూ ధరించి పోలీసు అవతారం ఎత్తారని, ఖుద్దూస్‌నగర్ వద్ద కారును ఆపి పోలీసుల స్టైల్‌లో గుమస్తాను ప్రశ్నించారు. కారుతో పాటు గుమస్తాను ప్రభాస్ కాలేజీ వద్దకు తీసుకొచ్చిన అతనిని బెదిరించి రూ.25.57 లక్షల నగదు ఉన్న బ్యాగ్, మొబైల్ తీసుకున్నారని పేర్కొన్నారు. పై అధికారిని తీసుకొస్తామని, అప్పటి వరకు ఇక్కడే ఉండాలని గుమస్తాకు చెప్పి అక్కడ నుంచి పరారయ్యారని తెలిపారు. కొంతసేపటి తర్వాత సొమ్మసిల్లి పడిపోయిన గుమస్తాను కారు డ్రైవర్ జగ్గయ్యపేటకు తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. అతను తేరుకున్న తర్వాత విజయవాడ వచ్చి సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు.
పోలీసుల అదుపులో నిందితులు
కేసు నమోదు చేసి విచారణ బాధ్యతను సీసీఎస్ పోలీసులకు అప్పగించామన్నారు. బీఆర్టీఎస్ రోడ్డులోని శాంతి ఇంట్లో పార్థసారథి, సుభానీఖాన్, శాంతితో పాటు నేరస్తులకు సహకరించిన హుజారిద్దీన్‌ను అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పరారీలో ఉన్న వంశీకృష్ణంరాజును త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. సమావేశంలో డీసీపీలు తిరుమలేశ్వరరెడ్డి, మహేశ్వరరాజు, ఏడీసీపీ రాజారావు, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐలు శ్రీనివాస్, రామ్‌కుమార్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
బంగారం వ్యాపారి గుమస్తా నుంచి రూ. 25.57 లక్షలు తీసుకుని పరారైన కేటుగాళ్లు నకిలీ పోలీసుల భరతం పట్టిన సీసీఎస్ విలేకరుల సమావేశంలో కమిషనర్ రాజశేఖరబాబు
Comments
Please login to add a commentAdd a comment