శివక్షేత్రానికి ‘కోటిలింగాల’ దత్తత!
జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల సమీపంలో దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోని కోటిలింగ హరిహర మహాక్షేత్రంలో కామాక్షి సమేత పంచముఖ అమృతలింగేశ్వర స్వామి ఆలయాన్ని గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్ర వ్యవస్థాపకుడు శివస్వామికి దత్తత ఇచ్చారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సీతారామయ్య శుక్రవారం ఆలయ రికార్డులను అప్పగించారు. ఈ సందర్భంగా శివస్వామి విలేకరులతో మాట్లాడుతూ.. 2006లో 132 ఎకరాల స్థలాన్ని అప్పటి వ్యవస్థాపకుడు కంచికచర్లకు చెందిన గద్దె ప్రసాద్‌తో కలిసి క్షేత్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెండేళ్లపాటు స్వామి, అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించామని ఆ క్రమంలో ప్రసాద్‌తో భిన్నాభిప్రాయాలు రావడంతో దూరంగా ఉన్నానని తెలిపారు. 2009లో క్షేత్రాన్ని రెండేళ్ల కాల పరిమితిలో ప్రహరీ, రాజగోపురం నిర్మించే ఒప్పందంతో దేవదాయ శాఖకు అప్పగించారన్నారు. ఈ క్రమంలో 2021లో భక్తులు రాకపోతుండటంతో ఆదాయం తగ్గిందని నిర్వహణ కష్టంగా ఉందని గద్దె ప్రసాద్ తన దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఆలయాన్ని తిరిగి అప్పగించాలని కోరినట్లు చెప్పారు. దీంతో దేవదాయ శాఖ అధికారులు కోటిలింగ హరిహర క్షేత్రాన్ని దత్తత ఇస్తున్నామని చెప్పి రికార్డులు అందజేయగా ధర్మాధికారిగా తాను బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. ఆలయానికున్న సుమారు 40 ఎకరాల్లో మాజీ మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాంకు చెందిన భూములు కూడా ఉన్నాయని, స్వామి వారికి ఇచ్చామనే ఉద్దేశంతోనే రఘురాం భూములను అడగడం లేదని చెప్పారు.
అధికారుల అప్పగింత
కోటిలింగ క్షేత్రాన్ని దేవదాయ శాఖాధికారులు శివస్వామికి ధారాదత్తం చేయటంపై గ్రామస్తులు, భక్తులు అవాక్కయ్యారు. 48 గంటల్లోనే అప్పగించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందని గ్రామస్తులు అంటున్నారు. ఆలయంలో పని చేస్తున్న 16 మంది అర్చకులు, సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనికి తోడు సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చెందిన భూములు ఉండటంతో ఆ కోవలోనే శివస్వామికి దత్తత ఇచ్చారనే కోణంలో భక్తులు, ప్రజలు సంశయం వ్యక్తం చేస్తున్నారు. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సీతారామయ్య మాట్లాడుతూ.. కోటిలింగ క్షేత్రంపై 2008లో లోకాయుక్తలో వ్యక్తి ఫిర్యాదు చేశారని, దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శివస్వామికి దత్తత ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ హరిదుర్గానాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆగమేఘాలపై అధికారుల అప్పగింత
Comments
Please login to add a commentAdd a comment