శాశ్వత పరిష్కారం చూపండి
చిలకలపూడి(మచిలీపట్నం): మీకోసంలో సమస్యలు చెప్పుకున్న అర్జీదారులకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. డీఆర్వోతో పాటు కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ
కలెక్టర్ శ్రీదేవి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పద్మదేవి అర్జీలు స్వీకరించారు. తొలుత డీఆర్వో మాట్లాడుతూ మీకోసం కార్యక్రమాన్ని మండలాల్లో కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో కలెక్టర్ బాలాజీ పమిడిముక్కల మండలాన్ని ఆకస్మికంగా సందర్శించి కార్యక్రమాన్ని నిర్వహించారని చెప్పారు. జనవరి 3వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మచిలీపట్నం లేడియాంప్తిల్ కళాశాలలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌ల ఆకాంక్షలకు అనుగుణంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే సందర్భంలో ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులకు ఉపయోగపడే విధమైన నోట్ పుస్తకాలు, పెన్నులు,
జామెంట్రీ బాక్సులు అందిస్తే బాగుంటుందని సూచించారు. జిల్లాలో వివిధ వసతి గృహాల్లో 1074 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారని వీరికి ఉపయోగపడే విధంగా ఈ కిట్లను అందజేస్తే బాగుంటుందని చెప్పారు. కలెక్టరేట్ ప్రహరీ వెంబడి లోపలివైపు మూడంచెల్లో చెట్లు నాటాలని కలెక్టర్ ఆకాంక్షించిన నేపథ్యంలో ఒక్కొక్క జిల్లా అధికారి ఒక్కొక్క చెట్టును నాటేందుకు చొరవ చూపాలని కోరారు. నాటిన చెట్టును సంరక్షణ కూడా చేయాలని పేర్కొన్నారు. మీకోసంలో 135 అర్జీలను అధికారులు స్వీకరించారు. మచిలీపట్నం నుంచి బంటుమిల్లి వెళ్లే ఆర్టీసీ బస్సు నారాయణపురం గ్రామంలోకి రావటం లేదని దీని కారణంగా బంటుమిల్లిలోని పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సమయానికి వెళ్లలేకపోతున్నారని బస్సు నారాయణపురం గ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు మీకోసంలో అర్జీ ఇచ్చారు. పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు రూ. 10 లక్షల ప్రమాదబీమా, ఈఎస్‌ఐ, పీఎఫ్, గుర్తింపుకార్డులు, ఉద్యోగ భద్రత, కనీస వేతనం, బకాయి వేతనాలు ప్రభుత్వ జీవో ప్రకారం అమలు చేయాలని కోరుతూ ఏపీ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎం.పోలినాయుడు అర్జీ ఇచ్చారు.
జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు
Comments
Please login to add a commentAdd a comment