బరి ‘తెగించారు’
కంకిపాడు: కూటమి నేతలు బరితెగించారు. కొత్త ఏడాది పురస్కరించుకుని కోడిపందేల బరులు ఏర్పాటుచేసే ప్రాంగణాల్లో లాంఛనంగా కోడిపందేలు నిర్వహించి పనులను చేపట్టారు. దీంతో పాటుగా మండలంలోని వివిధ గ్రామాల్లోనూ కోడిపందేలు యథేచ్ఛగా సాగాయి. ఇంత జరిగినా అధికారులు ప్రేక్షక పాత్ర వహించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు కోడిపందేల శిబిరాలు నిర్వహించేందుకు అధికార కూటమి నేతలు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇప్పటికే పెనమలూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బరులు ఏర్పాటుచేసేందుకు భూములను ఎంపిక చేసుకుని, బరుల ఏర్పాటు పనులను చేపట్టారు. భూమి ఒప్పందాలు కుదుర్చుకుని బరులు ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు. టీడీపీ, జనసేన పక్షాలు ఎవరికి వారు తమకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని కోడిపందేలు, కోతముక్క, గుండాట, ఇతర జూద క్రీడలను నిర్వహించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఎగిరిన పందెం కోళ్లు
కోడిపందేలు యథేచ్ఛగా సాగిస్తామనే ప్రచారాన్ని విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ముందుగానే పందెం రాయుళ్లతో పందెం ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఈడుపుగల్లులోని వేల్పూరు డొంకలో బుధవారం ఐదు కోడిపందేలు నిర్వహించారు. ఒక్కో పందెం రూ.50 వేల చొప్పున ఒప్పందం చేసుకుని పందేలు వేశారు. దీనికి పై పందేలు ఒక్కో పందేనికి రూ.10 లక్షల వరకూ నడిచినట్లు తెలుస్తోంది. కంకిపాడులో కోడిపందేలు నిర్వహించే శిబిరం చూపుళ్లు నిర్వహించి లాంఛనంగా ఓ పందెం వేసి బరి ఏర్పాటు పనులు మొదలుపెట్టారు. తెన్నేరు సమీపంలోని బుడమేరు డొంక వద్ద మంతెన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కంకిపాడు, గన్నవరం ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లను కలుపుకొని కోడిపందేలు అడ్డగోలుగా నిర్వహించాడు. పందేల పేరుతో లక్షల సొమ్ము చేతులు మారింది. లాంఛనంగా నిర్వహించే ఈ పందేలు సంక్రాంతి బరుల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నాయి. ఒకే రోజు ఇన్ని భారీ స్థాయిలో పందేలు నిర్వహించినా అధికారులు ప్రేక్షక పాత్ర వహించటం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ముందస్తుగానే పోలీసులకు, వివిధ శాఖల అధికారులకు సమాచారం ఉన్నా ఆ వైపు కన్నెత్తి చూడలేదనే వాదన వినిపిస్తోంది.
సంక్రాంతి బరులకు రిహార్సల్స్
జనవరి ఫస్ట్‌న ఎగిరిన పందెం కోళ్లు
భారీ స్థాయిలో జరిగిన పందేలు
చేతులు మారిన లక్షల సొమ్ము
Comments
Please login to add a commentAdd a comment