ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని శ్రీనటరాజస్వామి వారి ఆరుద్రోత్సవ కల్యాణోత్సవాలు 11వ తేదీ నుంచి ప్రారంభవుతాయని ఆలయ ఈవో కె. రామచంద్రమోహన్ పేర్కొన్నారు. 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో తొలి రోజున శ్రీ శివకామ సుందరీ సమేత నటరాజ స్వామి వారి ఉత్సవ మూర్తులకు మంగళస్నానాలు, నూతన వధూవరులుగా అలంకరిస్తారు. సాయంత్రం 4 గంటలకు అంకురార్పణ, మంటపారాధన, అగ్నిప్రతిష్టాపన, ధ్వజారోహణ, బలిహరణ వంటి వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. 12వ తేదీ రాత్రి 7 గంటలకు నటరాజ స్వామి వారి దివ్య లీలా కల్యాణోత్సవం, 10 గంటల నుంచి 11 గంటల వరకు స్వామి వారి ఆరుద్రోత్సవం(అభిషేకాలు, అన్నాభిషేకం) జరుగుతుంది. 13న తెల్లవారుజామున 4 గంటలకు ఉత్తర ద్వార దర్శనం, 9–30 గంటలకు పూర్ణాహుతి, అనంతరం ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి. సాయంత్రం 4.30 గంటలకు ఉత్సవ మూర్తులకు నగరోత్సవ సేవ జరుగుతుంది. కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ. 1,116 ఆర్జిత సేవ టికెట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment