పకడ్బందీగా జాతీయ క్రీడా పోటీలు
విజయవాడస్పోర్ట్స్: విజయవాడ వేదికగా నాలుగు రోజుల పాటు జరిగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌జీఎఫ్‌ఐ) 68వ అండర్–19 వాలీబాల్ బాలికల జాతీయ పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర స్కూల్ గేమ్స్ కార్యదర్శి జి.భానుమూర్తిరాజు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 26 రాష్ట్రాల నుంచి 400 మంది క్రీడాకారులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారని, మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ క్రీడా మైదానంలో ఈ నెల ఎనిమిదో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఈ పోటీలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఈ పోటీలకు సంబంధించిన వివరాలను పీబీ సిద్ధార్థ కాలేజీ మీడియా పాయింట్ వద్ద ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
క్రీడా స్ఫూర్తిని పెంచేలా..
క్రీడా స్ఫూర్తిని రగిలించేలా ఈ పోటీలను వైభవంగా నిర్వహిస్తున్నామని భానుమూర్తిరాజు తెలిపారు. 17 ఆర్గనైజింగ్ కమిటీలు, 40 మంది రిఫరీల పర్యవేక్షణలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అన్నీ క్రీడా జట్లకు, జట్లతో పాటు వచ్చిన 70 మంది కోచ్, మేనేజర్‌లకు త్రీ స్టార్ హోటళ్లలో బస కల్పించామని, పోటీల ప్రాంగణంలో అన్ని రాష్ట్రాల ఆహారపు వంటకాలను చేస్తున్నామని తెలిపారు. క్రీడాకారులను వారు బస చేసిన ప్రాంగణం నుంచి క్రీడా ప్రాంగణానికి బస్సుల్లో తీసుకొస్తామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పటిష్ట పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల తొమ్మిదో తేదీన క్రీడాకారులను మన రాష్ట్ర కీర్తిని చాటే పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తామని, పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులను మన రాష్ట్ర సంప్రదాయాలతో ఆహ్వానం పలికామన్నారు. ఈ నెల పదో తేదీ వరకు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు జరుగుతాయని, దీనికి అనువుగా నాలుగు కోర్టులు ఏర్పాటు చేశామని, ప్రతి రోజూ రాత్రి పది గంటల వరకు పోటీలు జరిపేందుకు ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర స్కూల్ గేమ్స్ సహాయ కార్యదర్శి రాధాకృష్ణ, అండర్–19 ఎస్‌జీఎఫ్ కృష్ణాజిల్లా కార్యదర్శి, పోటీల కార్యనిర్వాహక కార్యదర్శి వి.రవికాంత, పీబీ సిద్ధార్థ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సీహెచ్ వెంకటేశ్వర్లు, కృష్ణాజిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి దోనేపూడి దయాకరరావు పాల్గొన్నారు.
నేటి నుంచి పదో తేదీ వరకు
వాలీబాల్ బాలికల టోర్నీ
26 రాష్ట్రాల నుంచి రానున్న
400 మంది క్రీడాకారులు
వివరాలు వెల్లడించిన ఎస్‌జీఎఫ్‌ఐ
రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తిరాజు
Comments
Please login to add a commentAdd a comment