సుగ్రంథ పరిమళాలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ పుస్తక మహోత్సవం ఆదివారం పోటెత్తింది. వేలాదిగా సందర్శకులు తరలిరావటంతో పుస్తక మహోత్సవం ప్రాంగణంతో పాటుగా చుట్టుపక్కల ఉన్న పరిసరాలు సైతం కిక్కిరిసిపోయాయి. సందర్శకులు తమ పిల్లలతో కలిసి వచ్చి ప్రాంగణం మొత్తం కలియతిరిగి కావాల్సిన పుస్తకాలను కొనుగోలు చేశారు. స్టేడియం విశాలంగా ఉన్నప్పటికీ భారీగా వచ్చిన సందర్శకులతో ప్రాంగణం మొత్తం రద్దీగా దర్శనమిచ్చింది.
ధీశాలి భానుమతి..
అహంకారం అనే ముసుగు వేసుకొని సినిమా రంగంలో ఉన్న పురుషాధిక్య సమాజాన్ని ఢీకొట్టిన ధీశాలి సినీ నటిమణి పద్మభూషణ్ భానుమతిరామకృష్ణ అని ప్రముఖ జర్నలిస్టు, రచయిత రెంటాల జయదేవ్ అన్నారు. భానుమతి వివిధ రంగాల్లో చూపిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన కొనియాడారు. సినీ నటి భానుమతి రామకృష్ణ శతజయంతి సభను విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా ప్రధాన సాహితీవేదికపై ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యవక్త రెంటాల జయదేవ్ మాట్లాడుతూ.. సినిమా ప్రపంచంలో ఆత్మవిశ్వాసంతో, ప్రతిభతో సంపూర్ణ వ్యక్తిత్వంతో నిలబడిన నటీమణి భానుమతీరామకృష్ణ అన్నారు. సినిమాల్లోనూ బయటా ఆమె నమ్మిన విలువలకు కట్టుబడి జీవించించారని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి మాట్లాడుతూ.. బహుముఖ ప్రతిభతో సినిమారంగంలో ధృవతారగా వెలిగిన నటి భానుమతీ రామకృష్ణ అని అన్నారు. ఆమె నటించిన మల్లీశ్వరి, విప్రనారాయణ చిత్రాలు అద్భుత క్లాసికల్స్‌గా పేర్కొన్నారు.
సమగ్రాంధ్ర సాహితీస్ఫూర్తి ఆరుద్ర
సమగ్రాంధ్ర సాహితీ స్ఫూర్తి సుప్రసిద్ధ కవి, రచయిత ఆరుద్ర అని ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆరుద్ర శతజయంతి సభను ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ముఖ్యవక్తగా హాజరైన తెలకపల్లి రవి మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికీ, తెలుగువారికీ గర్వకారణమైన, చిరస్మరణీయమైన కవి ఆరుద్ర అన్నారు. పరిశోధనలోనూ, కృషిలోనూ, సృజనలోనూ సమగ్రతకూ, సాధికారితకూ చిరునామా ఆరుద్ర అని చెప్పారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర సృష్టికర్తగా ఆరుద్ర కృషిని ఆయన వివరించారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆచార్యులు ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కాల ప్రవాహంలో మరుగుపడకుండా నిలబడే స్థాయి తెలుగు భాషకూ, సాహిత్యానికీ సేవ చేసిన కవి, రచయితా ఆరుద్ర అన్నారు. సభకు ప్రముఖ పాత్రికేయులు సత్యాజీ అధ్యక్షత వహించారు.
Comments
Please login to add a commentAdd a comment